- 16 వాహన మరియు డెలివరీ రవాణా సంఘాల జేఏసీ సంచలన నిర్ణయం..
- యాప్ ఆధారిత గిగ్ కార్మికుల కనీస ఛార్జీలు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై డిమాండ్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో రవాణా మరియు అత్యవసర డెలివరీ సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. తమ సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు 16 వాహన మరియు డెలివరీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ప్రకటన విడుదల చేసింది.
ఈ బంద్ ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు, లారీలు, ఓలా, ర్యాపిడో, ఉబర్ సర్వీసులతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ వంటి ఆన్లైన్ క్విక్ కామర్స్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
రవాణా సంఘాల జేఏసీ (JAC) ప్రధాన డిమాండ్లు:
కనీస ఛార్జీల నోటిఫికేషన్: యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్ఫారం కంపెనీలు కలిసి కనీస బేస్ఫేర్తో పాటు ప్రతి కిలోమీటరుకూ, ప్రతి నిమిషానికీ న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలి.
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు: తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ రూల్స్ను వెంటనే అమలు చేస్తూ, కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి.
అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025: మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ను సమగ్రంగా అమలు చేసి, అగ్రిగేటర్ యాప్లకు స్పష్టమైన నిబంధనలు విధించాలి.
ప్రైవేట్ వాహనాల కమర్షియల్ వినియోగంపై నిషేధం:
మోటర్ వెహికల్స్ చట్ట ప్రకారం వైట్ ప్లేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను రైడ్ షేరింగ్ మరియు డెలివరీ సేవల్లో వాడకుండా నిషేధించాలి. ఇప్పటివరకు పలుమార్లు ప్రభుత్వానికి, రవాణా శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, అందుకే వేలాది మంది గిగ్ కార్మికులు మరియు డ్రైవర్ల స్థిరమైన ఆదాయం కోసం ఈ నిరవధిక సమ్మె బాట పట్టక తప్పలేదని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి సేవలు నిలిచిపోతుండటంతో నగరవాసులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.