Breaking News: శ్రీశైలం ప్రాజెక్టుకు పొంగిపొర్లుతున్న వరద..

శ్రీశైలం, ఏపీబీ న్యూస్: కృష్ణా పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా)లో కురుస్తున్న విస్తారమైన వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం రోజూ వేగంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం ఇన్ ఫ్లో ఏకంగా 2,44,998 క్యూసెక్కులకు చేరినట్లు ఇరిగేషన్ శాఖ అధికారుల నివేదిక వెల్లడించింది.

ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో అక్కడ నుంచి శ్రీశైలానికి కృష్ణా జలాలు ఉరకలెత్తుతున్నాయి.

  • ప్రస్తుత ఇన్ఫ్లో: 2,44,998 క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటిమట్టం: 866.90 అడుగులు (264.225 మీటర్లు)
  • పూర్తి స్థాయి నీటిమట్టం: 885.00 అడుగులు (269.750 మీటర్లు)
  • ప్రస్తుత నీటి నిల్వ: 129.4646 టీఎంసీలు
  • పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 215.8070 టీఎంసీలు

జూరాల ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రం ద్వారా 26,208 క్యూసెక్కులు, స్పిల్వే ద్వారా 2,18,790 క్యూసెక్కులు కలిపి శ్రీశైలానికి భారీగా నీరు వస్తోంది. కాగా సుంకేసుల, హంద్రీ మరియు స్థానిక వాగుల నుంచి ఎలాంటి ఇన్ ఫ్లో నమోదు కాలేదు.

ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని, స్పిల్వే క్రస్ట్ గేట్లను ఇంకా తెరవలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎగువ నుండి వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

Share
Share