- ట్రాన్స్ఫార్మర్ లు ట్రిప్ కావడంతో తరచూ కరెంట్ అంతరాయం
- పాత వైర్లు, ప్రమాదకర స్థంబాలపై సభ్యుల ఆందోళన
- మంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్తామని మేయర్ బుర్రి చైతన్య రెడ్డి వెల్లడి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నీలగిరి నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న విద్యుత్ సమస్యపై కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో ఏసీ(AC)ల వినియోగం భారీగా పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు తరచూ ట్రిప్ అవుతున్నాయని, దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో సభ్యులు పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు.
41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రూ.10 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. విద్యుత్ కోతల కారణంగా తాగునీటి సరఫరా కూడా దెబ్బతింటోందని, కరెంట్ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవానీ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో పాత కరెంట్ వైర్లు వేలాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్లతో మంటలు చెలరేగుతున్నాయని, వెంటనే పాత వైర్లు తొలగించి కొత్తవి అమర్చాలని కోరారు. అలాగే సెయింట్ ఆల్ఫన్సెస్ స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహిం మాట్లాడుతూ నగరంలో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, ట్రాన్స్‌కో అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కాలనీల్లో పాత విద్యుత్ స్థంబాల స్థానంలో ఎత్తైన కొత్త స్థంబాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ రేగట్టే అండాలు మాట్లాడుతూ డివిజన్లో వీధి కుక్కల బెడద అధికమైందని, చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో నెలకొన్న విద్యుత్ సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వేసవి కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో సమస్యలు తలెత్తుతున్నాయని, అదనపు ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ అజెండాను ఆమోదించినట్లు ప్రకటించారు.