- భూమి వివాదం సెటిల్ చేయడానికి భారీ డిమాండ్.. పక్కా స్కెచ్‌తో పట్టుకున్న అధికారులు
- తహశీల్దార్ కార్యాలయంలో అంతర్గత సోదాలు.. రికార్డులు స్వాధీనం
- రెవెన్యూ శాఖలో వణుకు పుట్టిస్తున్న ఏసీబీ మెరుపు దాడి!
మేడ్చల్ బ్యూరో, ఏపీబీ న్యూస్: తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ తహశీల్దార్ (MRO) సుచరిత రూ.20 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు నిర్వహించిన ఈ మెరుపు దాడితో మేడ్చల్ జిల్లావ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కార్యాచరణ శ్రేణుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.
అసలు ఏం జరిగిందంటే..?
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శామీర్పేట్ పరిధిలోని ఒక ఖరీదైన భూమి వివాదానికి సంబంధించిన ఫైల్ తహశీల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఆ భూమి రికార్డులను క్లియర్ చేసి, బాధితుడికి అనుకూలంగా ఆర్డర్ పాస్ చేయడం కోసం తహశీల్దార్ సుచరిత ఏకంగా రూ.20 లక్షల లంచాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
పక్కా వ్యూహంతో దాడి: తహశీల్దార్ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితుడు రహస్యంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం.. మంగళవారం సాయంత్రం కెమికల్ పూసిన రూ.20 లక్షల నగదును ఎమ్మార్వో సుచరితకు అందజేస్తుండగా, అక్కడ పొంచి ఉన్న ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
ఆఫీసులో గంటల తరబడి సోదాలు: ఎమ్మార్వో చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, తహశీల్దార్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శామీర్పేట్ తహశీల్దార్ కార్యాలయంలోని రికార్డులను, సదరు భూమి ఫైళ్లను ఏసీబీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. సుచరితకు సహకరించిన కొందరు కింది స్థాయి సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ల పాత్రపై కూడా కూపీ లాగుతున్నారు.
విశ్లేషణ: “భూభారతి కాదు.. ఇది భూహారతి!”
డిజిటల్ రికార్డులు, భూభారతి, స్పెషల్ డ్రైవ్ల పేరిట ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని చూస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం సామాన్యుల భూములకు అడ్డగోలుగా ‘హారతి’ పడుతూ జేబులు నింపుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ల్యాండ్ వాల్యూస్ కోట్లలో ఉండటంతో.. చిన్నపాటి వివాదాలను కూడా పరిష్కరించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టి ఇలా రూ.20 లక్షల మేర లంచాలకు తెగబడుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. లంచగొండి అధికారుల ఆస్తులపై కూడా ఏసీబీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.