- SH-02, NH-167 పరిధిలోని ప్రమాదకర కూడళ్ల తనిఖీ..
- స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, బారికేడ్ల ఏర్పాటుకు పోలీసు, R&B అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
మిర్యాలగూడ/నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి, వాహనదారుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. మిర్యాలగూడ పరిధిలోని SH-02 మరియు NH-167 రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న పలు ప్రమాదకర కూడళ్లు, ‘బ్లాక్ స్పాట్స్’ (Accident Prone Areas) ను ఆయన స్వయంగా పరిశీలించి దర్యాప్తు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా వెల్కమ్ టూ మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్డు, చిల్లాపురం క్రాస్ రోడ్డు, చింతపల్లి క్రాస్ రోడ్డు, జంకుతాడా రోడ్డు, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఎస్పీ, అక్కడ ప్రమాదాలు జరగడానికి గల సాంకేతిక మరియు మానవ తప్పిదాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీ గుర్తించిన ప్రధాన లోపాలు & జారీ చేసిన ఆదేశాలు:
ప్రమాదాలకు కారణాలు: అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్షపు ఓవర్‌టేకింగ్, సైన్ బోర్డులు లేకపోవడం, అక్రమ పార్కింగ్, రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడం మరియు రహదారులపై ఉన్న అనధికారిక కట్స్ (Unauthorized Openings).
క్షేత్రస్థాయి చర్యలు: ప్రమాదకర ప్రాంతాల్లో తక్షణమే స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సెంటర్ లైన్లకు రీ-పెయింటింగ్, సీసీ కెమెరాలు, బారికేడింగ్ మరియు రాత్రి వేళ మెరిసే రిఫ్లెక్టివ్ బోర్డులు/క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్ కంట్రోల్: జంక్షన్లలో అక్రమ పార్కింగ్‌ను వెంటనే తొలగించాలని, ప్రమాదకరమైన అనధికారిక రోడ్డు కట్స్‌ను మూసివేసి పరిమిత యూ-టర్న్‌లు మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆర్ అండ్ బీ (R&B), పంచాయతీ రాజ్, రవాణా (Transport), నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో మిర్యాలగూడ ఇంఛార్జ్ డీఎస్పీ రవి, సీఐలు పి.ఎన్.డి ప్రసాద్, సోమనర్సయ్య, నాగభూషణ్, నాగరాజు, ఎస్ఐ లక్ష్మయ్య, డీటీఆర్బీ ఇంఛార్జ్ అంజయ్యతో పాటు రోడ్డు భద్రతా కమిటీ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.