APB News Exclusive: ఎపిసోడ్ -2: ఎస్‌డీఎఫ్ టెండర్లు ఎక్సెస్ రేట్లకే.. రోడ్లు మాత్రం రియల్టర్ల వెంచర్లకే..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద చేపడుతున్న సిమెంట్ రోడ్ల పనులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన చోట, జనావాసాలు లేని శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న ప్రాంతాలకే పెద్ద ఎత్తున రోడ్ల పనులు కేటాయించడంపై రాజకీయ, ప్రజా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన రూ.86 కోట్ల ఎస్డీఎఫ్(SDF) నిధులతో కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలో సిమెంట్ రోడ్లకు ఈఎన్సీ(ENC) స్థాయిలో టెండర్లు పిలిచారు. అయితే ఎంపిక చేసిన పనుల్లో చాలా వరకు ఇప్పటికే రియల్టర్లు వెంచర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలే ఉండడం గమనార్హం. జనసాంద్రత అధికంగా ఉన్న కాలనీలు, దెబ్బతిన్న అంతర్గత రోడ్లు, మురుగు సమస్యలు ఉన్న ప్రాంతాలను పక్కనపెట్టి.. ఖాళీ స్థలాలు, అభివృద్ధి చెందని లేఅవుట్లలోనే పనులు ప్రతిపాదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్డీఎఫ్ కింద మంజూరైన రూ.86 కోట్ల నిధులతో రోడ్లు నిర్మించేందుకు కౌన్సిల్ తీర్మానించింది. 48 డివిజన్లు ఉన్న నల్లగొండలో అన్ని డివిజన్లకు కలిపి ఒకటే సింగిల్ టెండర్ పిలవాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. మున్సిపల్ యాక్ట్ రాకముందే వార్డుల్లో రోడ్లు ఎక్కవ వేస్తున్నారనే సంగతి ముందుగానే కౌన్సిల్లో తీర్మానించడం జరిగేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే పనుల విషయం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. కేవలం 48 డివిజన్ల్లో ఎన్ని కిలోమీటర్లు, మంజూరైన నిధుల వివరాలు మాత్రమే కౌన్సిల్లో పెట్టడం జరుగుతోంది. కార్పోరేషన్ ఇంజినీరింగ్ ఆఫీసర్లకు కూడా వచ్చే నిధులు, జరిగే పనుల పైన పూర్తి సమాచారం ఉండదు. 10 కోట్లు దాటితే ఈఎన్సీ (ఇంజినీరింగ్ ఇన్చీఫ్)స్థాయిలోనే టెండర్లు పిలుస్తున్నారు. దీంతో అసలు ఎంత మంది పోటీ పడ్డారు. ఎంత టెండర్ కోడ్ చేశారు.? ఏ డివిజన్లో పనులు జరుగుతున్నాయో కూడా కార్పోరేటర్లకు అంతుచిక్కడం లేదు. ఫలానా డివిజన్లో రోడ్డు పనులు ప్రారంభిస్తున్నామని కార్పోరేటర్ల వంతు వచ్చినప్పుడు చెప్పడం తప్పా వాళ్ల ప్రతిపాధనలు, సలహాలు, సూచనల గురించి పట్టించుకోవడం జరగదు. దీంతో అసలు నల్లగొండలో ఏ డివిజన్లో ఏం పనులు జరుగుతున్నాయో కూడా పక్క డివిజన్ కార్పోరేటర్ కు తెల్వదు. కేవలం మేయర్, కొంతమంది మంత్రి అనుచరులు, కమిషనర్ కు మాత్రమే తెలుస్తది. దీంతో వాళ్లకు ఎక్కడ అవసరమైందని భావిస్తే అక్కడే పనులు చేపట్టడం జరుగుతోంది తప్పా ప్రజాప్రయోజనాల గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

రూ.80 కోట్ల టెండర్ల వ్యవహారంలో కేవలం రెండు కన్స్ట్రక్షన్ కంపెనీలే టెండర్లలో పాల్గొన్నాయని తెలిసింది. దీంట్లో 4 శాతం ఎక్సెస్ కోడ్ చేసిన కంపెనీకి రూ.80 కోట్ల కాంట్రాక్టు దక్కింది. సింగిల్ టెండర్ వేయడం వల్ల మొదటికే మోసం వస్తదని భావించి మరొక కంపెనీతో అంతకు మించి ఎక్సెస్ రేట్ కు కోడ్ చేయించారని, దాంతో పోలిస్తే తక్కువ ఎక్సెస్ వేసిన సంస్థకు టెండర్ దక్కేలా ముందునుంచే పక్కా ప్లాన్ వేశారు. 80 కోట్లకు 4 శాతం ఎక్సెస్ అంటే సుమారు రూ.3.50 కోట్లు ప్రభుత్వం పైన అదనపు భారం పడినట్టే. ఇంత చేసినప్పటికీ అసలు రోడ్లు వేస్తున్న ఏరియాలు ఎక్కడనేది బయట పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 48 డివిజన్లలో 80కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేయాలన్నది అగ్రిమెంట్. దీనిలో భాగంగా ఇప్పటికే 20 కిలోమీటర్లు పూర్తిగా రూ.18 కోట్ల పేమెంట్ చేశారు. బ్యాలెన్స్ 60 కిలోమీటర్ల పనులు ఏ డివిజన్లో ఎక్కడ జరుగుతాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటికైతే రియల్టర్ల వెంచర్లకు ప్రాధాన్యత, జన సాంద్రత లేని శివారు ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. దీనివల్ల కార్పోరేషన్ కు నయాపైసా ఆదాయం రాకపోగా, మంత్రి కోమటిరెడ్డికి రాజకీయంగా నష్టం జరుగుతుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్ల ఆనవాళ్లు కోల్పోయిన డివిజన్లలో కొత్త రోడ్లు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share
Share