- పీఏసీఎస్(PACS)లకు ఎన్నికలు బంద్.. రైతు సొసైటీలపై రాజకీయ పట్టు
- ఓటుకు బదులు నామినేషన్.. చైర్మన్, 12 మంది డైరక్టర్లు
- ఎమ్మెల్యేల ప్రతిపాధన మేరకు ప్రభుత్వ ఆమోదం
- పదవీ కాలం ఆరు నెలలే.. లేదా ఎన్నికలు జరిగే వరకు
- 2019 రిజర్వేషన్ల ప్రకారంగానే పదవుల భర్తీ
- ఉమ్మడి జిల్లాలో 111 సొసైటీలు, 4.36 లక్షల మంది సభ్యులు
- యాదాద్రి జిల్లాలో 10 సొసైటీలకు పాలకవర్గం పూర్తి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఇన్నాళ్లు రైతులు ఓటు వేసి ఎన్నుకున్న పాలకవర్గాల స్థానంలో ఇకపై ఎమ్మెల్యేల సిఫార్సులతో నామినేటెడ్ పాలకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సొసైటీ లో ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లతో మొత్తం 13 మంది సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పదవీకాలాన్ని కేవలం ఆరు నెలలకు పరిమితం చేయడంతో సొసైటీలపై రాజకీయ నియంత్రణ మరింత పెరగనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2019 నాటి రిజర్వేషన్లే..
ప్రభుత్వం 2019లో అమల్లో ఉన్న రిజర్వేషన్ల ఆధారంగానే పాలకవర్గాలను నియమించాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియపై ఇప్పటివరకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయకుండా మౌఖిక ఆదేశాలతోనే ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదించి జిల్లా సహకార అధికారికి పంపించనున్నారు. అనంతరం సహకార శాఖ మంత్రి, రిజిస్ట్రార్ ఆమోదంతో పాలకవర్గాల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఐదేళ్ల పదవికి బదులు ఆరు నెలలే..
ఎన్నికల ద్వారా ఏర్పడే పాలకవర్గాలకు ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. కానీ నామినేటెడ్ విధానంలో ఆరు నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు మాత్రమే పదవీకాలం ఉంటుందని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో అవసరమైతే మధ్యలోనే పాలకవర్గాలను మార్చే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల అభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
4.36 లక్షల మంది సభ్యుల ఓటు హక్కుకు గండి
ఉమ్మడి జిల్లాలో 111 పీఏసీఎస్(PACS)ల్లో సుమారు 4.36 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నల్లగొండలో 43 సొసైటీల్లో 1.70 లక్షల మంది, సూర్యాపేటలో 47 సొసైటీల్లో 1.66 లక్షల మంది, యాదాద్రి భువనగిరిలో 21 సొసైటీల్లో లక్ష మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికలు జరిగి ఉంటే సభ్యులందరికీ ఓటు హక్కు ఉండేది, కానీ నామినేటెడ్ విధానం కారణంగా ఆ అవకాశం లేకుండాపోయింది. సభ్యత్వం ఉన్న రైతుల్లో ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారికే చైర్మన్, డైరెక్టర్ పదవులు దక్కనున్నాయి.
సొసైటీలపై ఎమ్మెల్యేల రాజకీయ కుస్తీ
నామినేటెడ్ విధానంతో అధికార పార్టీ నేతల్లో పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో సొసైటీలో 13 పదవులు మాత్రమే ఉండటంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అనుచరులకు పదవులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సహకార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కారణంగానే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క సొసైటీకి కూడా పాలకవర్గం ప్రకటించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం 21 సొసైటీల్లో 10 సొసైటీలకు నియామకాలు పూర్తయ్యాయి. భువనగిరి సెగ్మెంట్లో ఆరూరు, జూలూరు, పోచంపల్లి, వలిగొండ, ఆలేరు నియోజకవర్గంలో వంగపల్లి, రామన్నపేట, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో సొసైటీల ఎంపిక జరగలేదు.
హైకోర్టు బాటలో ఆశావహులు
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్ విధానం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆశావహులు, ప్రతిపక్ష పార్టీలు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నాయి. సహకార సంఘాల చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ త్వరలోనే పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహకార సంఘాలు రైతుల స్వయం ప్రతిపత్తికి ప్రతీకగా నిలిచాయి. ఎన్నికల ద్వారా రైతులే తమ నాయకత్వాన్ని ఎన్నుకునే వ్యవస్థకు బదులుగా నామినేటెడ్ విధానం అమలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ జోక్యం పెరిగితే రైతు ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమ వుతోంది.