APB News Exclusive: డెడ్ స్టోరేజీలోకి ఉదయ సముద్రం.. నాలుగు పట్టణాలకు తాగునీటి ముప్పు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో తాగునీటి సంక్షోభం ముంచుకొస్తోంది. జిల్లాకు ప్రధాన తాగునీటి ఆధారమైన ఉదయ సముద్రంలో ప్రస్తుతం కేవలం 12 రోజులకే సరిపడా నీటి నిల్వలు మిగిలాయి. ఆ తర్వాత నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడంతో నల్లగొండ, చిట్యాల, నకిరేకల్, చండూరు మున్సిపాలిటీలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటి సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం నెలకొంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఏఏమ్మార్పీ(AMRP) ప్రధాన కాలువ లైనింగ్ పనులు నిలిపివేసి తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

జిల్లాలో తాగునీటి పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పానగల్లు సమీపంలోని ఉదయ సముద్రం రిజర్వాయర్ ప్రస్తుతం 0.58 టీఎంసీ(TMC)ల నీటితోనే కొనసాగుతోంది. ఇందులో 0.30 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉండగా, ఆ తర్వాత బురద కారణంగా నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మరో 12 నుంచి 13 రోజులకే సరిపోతాయి. ఉదయ సముద్రం ద్వారానే నల్లగొండ, చిట్యాల, నకిరేకల్, చండూరు మున్సిపాలిటీలతో పాటు అనేక గ్రామాలకు తాగు నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్ పూర్తిగా ఖాళీ అయితే ఈ ప్రాంతాలన్నింటిలోనూ తీవ్రమైన తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.

ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 513 అడుగుల వద్ద ఉంది. మరో మూడు అడుగులు తగ్గి 510 అడుగులకు చేరితే నీటిని ఎత్తి పోసే పరిస్థితి మరింత క్లిష్టంగా మారనుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు కుడి కాలువ ద్వారా నీటి విడుదల కూడా కొనసాగాల్సి ఉండటంతో తెలంగాణకు అందే నీటి పరిమాణంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని వీలైనంత వేగంగా ఉదయ సముద్రానికి తరలించేందుకు అధికారులు ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లోనే పుట్టంగండి ఎత్తిపోతల కేంద్రం నుంచి ఉదయ సముద్రానికి నీటిని తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసి వారం రోజుల పాటు సరఫరా చేస్తే సుమారు 1.10 టీఎంసీల నీరు ఉదయ సముద్రానికి చేరే అవకాశం ఉంది. ఉదయ సముద్రం పూర్తి నిల్వ సామర్థ్యం 1.50 టీఎంసీలు అయినప్పటికీ, కరకట్ట బలహీనంగా ఉండటంతో భద్రతా కారణాల రీత్యా 1.20 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. సుమారు 1.10 టీఎంసీల వరకు నింపగలిగితే నవంబర్, డిసెంబర్ వరకు తాగునీటి అవసరాలు తీరే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.

పుట్టంగండి ఎత్తిపోతల కేంద్రంలో మొత్తం నాలుగు మోటార్లు ఉండగా ప్రస్తుతం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ లోపంతో నిలిచిపోయిన మరో మోటారును యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి మూడో మోటారును కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ట్రాన్స్ఫార్మర్ తెప్పించి మూడో మోటార్ ఆన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సాగర్లో నీటిమట్టం తగ్గడంతో నాలుగో మోటారును ప్రస్తుతం వినియోగించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదిలావుంటే హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్కు మాత్రం నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. నాగార్జునసాగర్ లో 507 నీటి అడుగులకు నీటి మట్టాలు పడిపోయినప్పటికీ హైదరాబాద్ కు నీటి సరఫరాలో ఎలాంటి సమస్య తలెత్తదు. దీనికి తగినట్టుగా పుట్టంగండి వద్ద ఏర్పాట్లు చేశారు.

తాగునీటి అవసరాల దృష్ట్యా ఏఏమ్మార్పీ ప్రధాన కాలువ లైనింగ్ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. గత మూడు రోజులుగా అధికారులు ఇదే అంశంపై సమీక్షలు నిర్వహిస్తూ, తాగునీటికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. నిజానికి ఉదయ సముద్రంలో ఇప్పుడు నీటి నిల్వలు కనీసం రెండు నెలల వరకు సరిపోతాయని ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ రిజర్వాయర్లో అక్రమంగా మూడు, నాలుగొందల వ్యవసాయ మోటార్లు నడిపిస్తున్నారు. వీటిని తొలగించేందుకు రైతులు అంగీకరించట్లేదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు ఉదయ సముద్రం రిజర్వాయర్ కు క్యాచ్మెంట్ ఏరియా లేకపోవడం దురదృష్టకరం. పరిసర ప్రాంతాల్లోని చెరువుల నుంచి లేదా వర్షపు నీరు ఉదయ సముద్రంలో ప్రవేశించే అవకాశం లేదు. రిజర్వాయర్ కు నలువైపులా గ్రామాలు, నల్లగొండ పట్టణం విస్తరించి ఉన్నందున రిజర్వాయర్ కు కృష్ణా నీళ్లు తప్పా మరో ప్రత్యామ్నయ మార్గం లేకపోవడంతో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడం కష్టమవుతోంది. మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఆకస్మికంగా నీటి విడుదల చేయాల్సి రావడంతో పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం సుమారు 513 అడుగుల వద్ద ఉంది. సోమవారం ఉదయం నుంచి ఏకేబీఆర్ ద్వారా రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసి ఉదయ సముద్రాన్ని నింపాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజుల పాటు ఈ విడుదల కొనసాగితే సుమారు 1.10 టీఎంసీల నీరు ఉదయ సముద్రంలోకి చేరే అవకాశం ఉంది. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. నవంబర్ వరకు భారీ వర్షాలకు అవకాశం తక్కువగా ఉండటంతో సాగర్లోకి గణనీయమైన వరద జలాలు వచ్చే అవకాశాలు కూడా స్వల్పంగా కనిపిస్తున్నాయి. ఆల్మట్టి నుంచి భారీ వరదలు వస్తే తప్ప పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.

Share
Share