- 64 మందితో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటన
- ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు,
- కార్యదర్శుల నియామకాలకు టీపీసీసీ ఆమోదం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లో వివిధ పదవుల నియామకాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆమోదం తెలిపింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శుల నియామకాలను టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్త కమిటీలో మొత్తం 64 మందికి స్థానం కల్పించారు. ఇందులో 10 మంది ఉపాధ్యక్షులు, 24 మంది ప్రధాన కార్యదర్శులు, 3 మంది అధికార ప్రతినిధులు (స్పోక్స్పర్సన్స్), 27 మంది కార్యదర్శులను నియమించారు. జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను విస్తరించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
టీపీసీసీ ఉత్తర్వుల ప్రకారం గుత్తా మాధవరెడ్డి, బ్రహ్మదేవర రమేశ్, ఆలంపల్లి నర్సింహ, ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గాలి రవికుమార్, కథుల కోటి, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, అబ్బగోని రమేశ్ గౌడ్, ఎండీ ముంతాజ్ అలీ, కిన్నెర శ్రీనివాస్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శుల జాబితాను కూడా విడుదల చేశారు.
జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డీసీసీ కమిటీలో మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గంతోపాటు, శాలిగౌరారం మండలాలను పెండింగ్లో పెట్టారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గీయుల మధ్య పోటీ కారణంగా కమిటీలో చోటు కల్పించలేదు. మునుగోడులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పదవులు భర్తీ చేసిన అనంతరం మిగిలిన వాళ్లకు జిల్లా కమిటీలో చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెండింగ్లో పెట్టారు. శాలిగౌరారంలో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలు కారణంగా అక్కడి వాళ్లకు కూడా కమిటీలో చోటు కల్పించలేదు.