- వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. ఎల్‌నినోపై ఆలస్యంగా సమీక్ష
- సీఎం ఆదేశాల తర్వాతే క్షేత్రస్థాయిలో కదలిక..
- తాగునీటి, సాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు ఎక్కడ?
- జిల్లా మంత్రుల తీరుపై స్వరం పెంచుతున్న ప్రతిపక్షాలు
నల్లగొండ, ఏపీబీ న్యూస్ ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగునీటి ఎద్దడి, సాగునీటి అనిశ్చితి, వడ్ల కొనుగోళ్ల వంటి కీలక అంశాలపై జిల్లా మంత్రులు ఆలస్యంగా స్పందిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సమస్యలు మొదలైనప్పుడే క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టాల్సిన ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల తర్వాతే జిల్లా వైపు దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
వడ్ల కొనుగోళ్లలోనూ అదే తీరు
యాసంగి వడ్ల కొనుగోళ్ల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నా జిల్లా స్థాయిలో పెద్దగా స్పందన కనిపించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మిల్లర్ల అక్రమాలు, కొనుగోళ్లలో జాప్యంపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా అధికారులు చురుగ్గా వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి కఠిన ఆదేశాలు జారీ చేసిన తర్వాతే అధికార యంత్రాంగం కదిలిందని, అప్పటికే రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.
ఇప్పుడు ఎల్‌నినోపై ఆలస్యంగా మేల్కొన్నారా..?
ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ, నిపుణులు ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేక సమీక్ష ఆలస్యంగా జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్, ఏఎంఆర్పీ(AMRP) ఆయకట్టు రైతులు సాగునీటి ఆందోళనలో ఉండగా, గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యలు మొదలవుతున్న సమయంలో జిల్లా స్థాయిలో ముందస్తు కార్యాచరణ కనిపించలేదు.ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన అనంతరం ఉమ్మడి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం పెట్టారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు వంటి అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ సమీక్ష ముందుగానే జరిగి ఉంటే మరింత ప్రయోజనం ఉండేదని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
‘సర్’ విషయంలోనూ ఇదే పరిస్థితి..?
‘సర్’ అంశంపై కూడా సీఎం పలుమార్లు హెచ్చరించిన తర్వాతే పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా కదిలిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ స్థాయిలో అవగాహన సమావేశాలు కూడా జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ వెనకబడి ఉందనే సంగతి సీఎం చెబితే తప్పా స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రంలో వెనబడిన 23 నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ కూడా ఉందని చెప్పారు.
హైదరాబాద్‌కే పరిమితమైన రాజకీయాలా..?
జిల్లాలో కరవు పరిస్థితులు, సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి వంటి అంశాలు రోజురోజుకూ పరిస్థితులు అదుపుతున్నాయి. కానీ జిల్లా మంత్రులు ఎక్కువ సమయం హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనే గడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి హ్యామ్(HAM) రోడ్ల బిజీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నందున జిల్లాకు రావడం కుదరలేదని చెప్తున్నారు. మరో మంత్రి ఉత్తమ్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కానీ జిల్లా స్థాయిలో రివ్యూ నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేకపోయారని ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.