- మంత్రి కోమటిరెడ్డి కలల ప్రాజెక్టుకు వీడని చిక్కులు
- వక్ఫ్ భూముల్లో నిర్మాణమంటూ హైకోర్టులో కేసులు
- బోర్డు అనుమతి లేకుండా పనులు చేపట్టారని మతపెద్దల ఆరోపణ
- ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన 7 ఎకరాల భూమిపైనా చిక్కులు
- మంత్రి జోక్యంతోనే శాశ్వత పరిష్కారం మైనార్టీ నేతల అభిప్రాయం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో రూ.140 కోట్ల వ్యయంతో లతీఫ్ సాబ్ గుట్టపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు ప్రాజెక్టు వివాదం మరింత ముదిరింది. పనులు ప్రారంభమై ఏడాది దాటినా వక్ఫ్ భూముల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండానే రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, మైనార్టీ మత పెద్దలు కూడా ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గుట్టకు ప్రత్యామ్నాయంగా అమ్మదేవి గూడెం వద్ద ఇస్తామని చెప్పిన 7 ఎకరాల భూమిపైనా చట్టపరమైన సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని పరిష్కారం చూపకపోతే వివాదం మరింత సంక్లిష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఘాట్ రోడ్డు పనులకు వక్ఫ్ బోర్డు నిరాకరణ..
లతీఫ్ సాబ్ దర్గా వైపు ఘాట్ రోడ్డు నిర్మాణానికి వక్ఫ్ బోర్డు అభ్యంతరం చెప్పలేదు. కానీ బ్రహ్మంగారి గుట్టపై ఉన్న శివాలయానికి వెళ్లే మార్గం వక్ఫ్ భూముల మీదుగా ఉండటంతో రోడ్డు నిర్మాణానికి బోర్డు అనుమతి తప్పనిసరి. ఈ మార్గంలో వక్ఫ్బోర్డు కోల్పోయే 7 ఎకరాల భూమికి బదులుగా అమ్మదేవి గూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 33లో 7 ఎకరాలు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆ భూమిని ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోలేదు. అలాగే రోడ్డు నిర్మాణానికి ఆర్ అండ్ బీ(R&D) శాఖకు వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి ఎన్ఓసీ(NOC) కూడా జారీ కాలేదు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు అనుమతి, భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి ఉండగా, ఆర్ అండ్ బీ శాఖ మాత్రం ఈ ప్రక్రియలు పూర్తి కాకముందే పనులు చేపట్టింది. దీనిపై జిల్లా యంత్రాంగం అమ్మదేవి గూడెం వద్ద 7 ఎకరాల భూమి కేటాయింపునకు అంగీకరించి, వక్ఫ్ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. అయితే బోర్డు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో అమ్మదేవి గూడెం భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు వక్ఫ్ ఇన్స్పెక్టర్పై ఒత్తిడి తెచ్చారు. కానీ వక్ఫ్ బోర్డు సీఈఓ అనుమతి లేకుండా భూములను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ(RDO), వక్ఫ్ ఇన్స్పెక్టర్ కలిసి అమ్మదేవిగూడెంలోని భూములను పరిశీలించారు. ఇన్స్పెక్టర్ ఏసీబీ(ACB)కి చిక్కడానికి ఒక రోజు ముందే ఇది జరిగింది. అదే సమయంలో సీఈఓ అనుమతి లేకుండా భూములను స్వాధీనం చేసుకోవడం కుదరదని వక్ఫ్ ఇన్ స్పెక్టర్ అధికారులకు మరోసారి స్పష్టంచేయడంతో వివాదం మళ్లీ మొదటి కి వచ్చింది. ఈలోగా ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడటంతో ఘాట్ రోడ్డు వ్యవహారం మరింత జఠిలంగా మారింది.
హైకోర్టులో రోడ్డుకు వ్యతిరేకంగా కేసులు..
వక్ఫ్ భూముల్లో ఘాట్ రోడ్డు ఎలా నిర్మిస్తారని హైకోర్టులో ముగ్గురు వ్యక్తులు పిటీషన్ దాఖలు చేశారు. వీళ్లలో ఒకరు కాస్తంతా వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కానీ మిగితా ఇద్దరు మాత్రం వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు తీవ్రంగానే పోరాడుతున్నారు. వక్ఫ్ భూముల్లో ఘాట్ రోడ్డును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లను బుజ్జగించేందుకు జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమ్మదేవి గూడెం వద్ద ఇస్తామని చెప్పిన ఏడెకరాల భూమితోపాటు, ఘాట్ రోడ్డు వద్ద ముస్లింల కబరస్తాన్ కు కేటాయించిన 25 ఎకరాల జాగకు ప్రహారిగోడ, షాదీఖాన, ఈద్గా విస్తరణ హామీలు పెండింగ్లోనే ఉన్నాయి. అదేక్రమంలో ఘాట్ రోడ్డును అడ్డంపెట్టి రియల్టర్లు భారీగా సొమ్ము చేసుకోవడంతో మైనార్టీల్లో మరింత అలజడి రేకెత్తించింది. మంత్రి కోమటిరెడ్డి మీద ఉన్న నమ్మకంతో ఇప్పటి వరకు ఏదోవిధంగా కోర్టులో కేసును వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. ఇంకోవైపు గుట్ట పైన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నల్లగొండ ప్రజల్లో నెలకొంది.
వక్ఫ్ బోర్డును ఒప్పిస్తేనే సమస్యలకు ఫుల్ స్టాప్..
వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం భూమికి బదులు మరొక భూమిని తీసుకోవడం కుదరదు. కానీ ఇదే చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయని సీనియర్ ఆఫీసర్లు చెపుతున్నారు. ప్రజాప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను వాడుకునే అవకాశం ఉంది. దీనికి బదులు వేరొక చోట భూమిని చూపించాలి. వక్ఫ్ ఆక్ట్ ప్రకారం ఈ వ్యవహారం సాఫీగా సాగాలంటే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటే తప్పా సాధ్యం కాదని మైనార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా మంత్రి అనుచరుల నిర్వాహకం వల్ల భూముల వ్యవహారం తప్పుతోవ పడుతోందని, కానీ ఇదంతా రాష్ట్ర స్థాయిలోనే జరగాల్సిన తంతు అని చెపుతున్నారు. బోర్డు సీఈఓ, చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనార్టీ మంత్రి ద్వారా ఫైల్ కదలించి సీఎం ఆమోదం పొందితే తప్పా భూమికి బదులు మరొక చోట భూమి తీసుకోవడం సాధ్యం కాదని సీనియర్ ఆఫీసర్ చెప్పారు. దీని గురించి మంత్రికి వివరించి చెప్పేందుకు మైనార్టీ లీడర్లు, మతపెద్దలు ప్రయత్నించి విఫలమయ్యారు. కనీసం మంత్రి తమ ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితి లేదని దీని వల్ల మైనార్టీ ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు.