APB News Exclusive: ఎపిసోడ్ -3: కతాలగూడ లో రూ.20 కోట్ల భూదందా..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని కతాలగూడ డివిజన్లో భారీ భూకుంభకోణం బట్టబయలైంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, చెరువు బాటలను రియల్టర్లు కబ్జా చేసి, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిపిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సుమారు రూ.20 కోట్ల విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని పక్కా స్కెచ్ తో ఈ దందా నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కతాలగూడలో ఎకరం భూమి 3 నుంచి 5 కోట్లు పలుకుతోంది. దాదాపు 40 ఎకరాల్లో వెంచర్ పనులు జరుగుతున్న క్రమంలో దీంట్లో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది? ఇరిగేషన్ భూములు ఎక్కడా ఉన్నాయన్నది బయటకు రాకముందే భూములను మాయం చేస్తున్నారు. రైతుల మధ్య గొడవలు సృష్టించి, డబుల్ రిజిస్ట్రేషన్లు, రహస్య పంచునామా ముసుగులో రూ.20 కోట్ల విలువైన 4 ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం సంచలనంగా మారింది. రెవెన్యూ అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగవని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఒకవైపు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి, మరొక వైపు కతాలగూడ చెరువుకట్ట బాట భూమిని ఆక్రమించిన తీరు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగానే వ్యవహారించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గ్రీన్ సిటీ వెంచర్లో ఆక్రమణకు గురైన కతాలగూడ చెరువు బాటను రియల్టర్లు ఆక్రమించారు. 30 ఫీట్ల బాటను 20 ఫీట్లకు కుదించిన వ్యవహారంలో రెవిన్యూ ఆఫీసర్లు పోషించిన పాత్ర విస్మయానికి గురిచేస్తోంది. స్థానిక రైతులు చెప్తున్న దాని ప్రకారం కొత్త వెంచర్లో 504, 505, 523, 524 సర్వే నంబర్ల చుట్టే ఆక్రమణల బాగోతం నడుస్తోంది. 504, 505లో చెరువు బాట రెండెకరాలు, 523, 524లో ప్రభుత్వ స్థలం రెండెకరాలు ఉన్నదని స్థానిక రైతులు చెపుతున్నారు. దీంట్లో చెరువు బాట రెండు ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు కొత్త పట్టేదారులను సృష్టిస్తున్నారు. ఇటీవల 12.50 గుంటల జాగలో జరిగిన ఉదంతమే దీనికి నిదర్శనం. 504, 505లో వారసత్వంగా వచ్చిన 12.50 గుంటల జాగను ఎప్పుడో అమ్ముకున్న ఒక పట్టేదారు పేరు మీద మళ్లీ 12.50 గుంటల జాగను సృష్టించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

30 ఫీట్ల రోడ్డును 20 ఫీట్లకు కుదించి, అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారిగోడ
30 ఫీట్ల రోడ్డును 20 ఫీట్లకు కుదించి, అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారిగోడ

రైతుల మధ్య చిచ్చురాజేసి చెరువు బాటను కబ్జా చేయాలని రియల్టర్లు వేసిన ప్లాన్ కు, అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 30 ఫీట్ల వెడల్పుతో దాదాపు రెండు ఎకరాల మేర విస్తరించిన స్థలంలో రాత్రికి రాత్రే కొత్త పట్టేదారులు ఎలా పుట్టుకొచ్చారనేది లోతుగా పరిశీలిస్తే దీంట్లో రెవిన్యూ ఆఫీసర్లు ఆడిన పంచునామా డ్రామా మరింత రక్తి కట్టించింది. రైతులు చెప్తున్నట్టు 503, 504 సర్వే నంబర్లో 12.50 గుంటల భూమి కలిగిన ఒక పట్టేదారు ఎప్పుడో తన భూమిని ముగ్గురికి విక్రయించారు. ఇద్దరికి ఐదు గుంటల చొప్పున, మరొకరికి రెండు గుంటలు విక్రయించడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త వెంచర్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో రియల్టర్ల కన్ను 30 ఫీట్ల బాట పైన పడింది. దీన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్లాన్ తో అదే సర్వే నంబర్ లో గతంలో భూములు అమ్మిన పట్టేదారులను బాట జాగపైకి ఉసిగొల్పారు. 503, 504 నంబర్లో ఇంకా 12.50 గుంటల భూమి ఉందని, కానీ అది రికార్డుల్లోకి ఎక్కడం మిస్సైందని, తమకు పూర్వీకుల నుంచి వస్తోన్న ఆస్తి అని చెప్పి రైతులతో తహాశీల్దారు ఆఫీసులో పిటీషన్ పెట్టారు. దాంతో రెవిన్యూ ఆఫీసర్లు హుటాహుటిన చెరువుబాట వద్ద గుట్టుచప్పుడు కాకుండా రహస్య పంచునామా చేశారు. కతాలగూడలో రియల్టర్లకు అనుకూలమైన వ్యక్తులను విచారించి, సాక్షి సంతకాలు తీసుకుని మిస్సైందని చెప్పిన 12.50 గుంటల జాగను రికార్డుల్లోకి ఎక్కించారు. ఇంకేముంది సదరు రైతు పేరు మీద ప్రభుత్వ పట్టా పాసుపుస్తకం కూడా జారీ చేసింది. ఇదే పాసుపుస్తకాన్ని అడ్డంపెట్టుకుని బాట జాగలో తనకు కూడా హక్కు ఉందని చెప్పి ఇంకొంతమంది రైతులను కూడగట్టుకుని 30 ఫీట్ల బాట అవసరం లేదని, 20 ఫీట్ల బాట చాలని రియల్టర్లకు 12.50 గుంటల జాగను విక్రయించాడు. తెరవెనక జరుగుతున్న ఈ తంతగాన్ని పసిగట్టి నిలదీసిన రైతుల పైన దాడులు చేశారు. దీంతో బాధితులు తహాశీల్దార్ కు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో లాభం లేదని మున్సిపల్ ఆఫీసు, ఆర్డీఓ(RDO), కలెక్టర్, ఎస్పీ(SP)కి ఫిర్యాదు చేశారు. కానీ నేటి వరకు ఎలాంటి ఫలితం దక్కలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించి నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ తహాశీల్దార్ ఆఫీసర్లలో కదలిక లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నాలా పర్మిషన్ లేకుండా పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం మహాలక్ష్మీ వెంచర్ లో పార్టనర్లుగా ఉన్న అప్పటి రియల్టర్లు, తాజాగా కొత్త వెంచర్ రియల్టర్లతో కలిసి భూఆక్రమణలకు తెరలేపారు. కతాలగూడ గ్రామపంచాయతీగా ఉన్న కాలంలోనే సర్వే నంబర్లు 523, 524లో మహాలక్ష్మీ వెంచర్ ఏర్పాటైంది. ఈ వెంచర్ కు నాలా పర్మిషన్ లు, డీటీసీపీ(DTCP) లేఅవుట్ లేదు. రియల్ ఎస్టేట్ భాషలో వీటిని కచ్చా వెంచర్లు’ అని పిలుస్తారు. అయితే వెంచర్ డెవలప్మెంట్ లో భాగంగా కొందరు రైతులు రియల్టర్లకు భూములు విక్రయించారు. ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్లు అమ్మే క్రమంలో రోడ్లు, పార్కుల కోసం కేటాయించిన మిగులు భూమి రెండు ఎకరాలు పట్టేదారుల పైనే ఉన్నది. రెవిన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ జరగలేదు. దీంతో సర్వే నంబర్ 523, 524 లో ఉన్న రెండు ఎకరాల భూమి అప్పటి నుంచి రెవిన్యూ రికార్డుల్లో తొలగించకపోవడంతో 524/1/1 లో 06 గుంటలు, 524/13 /1/1లో 6 గుంటలు, 524/4లో 34.50 గుంటల భూమి ధరణి పాసుపుస్తకాల్లోకి ఎక్కింది. నిజానికి భూమి లేకపోయినప్పటికీ రికార్డులో భూమి ఉన్నందున ఇదే అధునుగా భావించిన అక్రమార్కులు 524/4 నుండి 22 గుంటలు తప్పుడు సరిహద్దులు చూపించి నల్లగొండ తహాశీల్దార్ ఆఫీసులో గతేడాది అక్టోబర్ లో (డాక్యుమెంట్ నంబరు 1969/2025) మరొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. మళ్లీ ఇదే సర్వే నంబరు 524/4లో 12.50 గుంటల భూమిని వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ మరోచోట సరిహద్దులు చూపించి కొత్త వెంచర్లోని పార్టనర్లకు ఇటీవలే విక్రయించారు.

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మహాలక్ష్మీ వెంచర్ లో విక్రయించిన 524, 523 సర్వే నంబర్లలోని భూములను అడ్డంపెట్టుకుని ఉన్నపళంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వల్ల ఎవరికి లాభం? అని ఆరా తీయగా రియల్టర్ల మాయాజాలం బయట పడింది. ఇన్నాళ్లు పట్టేదారుల పైన ఉందని చెప్తున్న ఈ భూమి ఈ ఏడాది మార్చి 28న కొత్త వెంచర్ లోని పార్టనర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబరు 363/20 26) చేశారు. ఇన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోని సర్వే నంబరు 524 ఇప్పుడు వివాదస్పదంగా మారడానికి ప్రధాన కారణం ఇదే సర్వే నంబర్ లో దేవరకొండ మెయిన్ రోడ్డు ను ఆనుకుని ఉన్న రెండెకరాల పైన కన్నేసిన రియల్టర్లు దాన్ని ఆక్రమించేందుకు పథకం పన్నారని రైతులు ఆలస్యంగా పసి గట్టారు. ఈ భూమిని ఏదోవిధంగా కబ్జా చేయాలంటే 524 సర్వే నంబర్ లో రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఇదేనని, ఈ సర్వే నంబర్ లో ఎక్కడా ప్రభుత్వ జాగ లేదని అధికారులను నమ్మించడం కోసమే ఇదంతా చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ దందా గురించి రెవిన్యూ ఆఫీసర్లకు ముందుగానే తెలుసని, చెరువుబాట జాగ ఇష్యూ జరిగినప్పుడే ప్రభుత్వ భూమి గురించి చర్చకు వచ్చిందని చెప్తున్నారు. ఈ ఢీల్ లో కోట్ల రూపాయాలు చేతులు మారాయని స్థానిక రైతులు అంటున్నారు. దీని పైన విచారణ చేయాలని ఫిర్యాదు చేసినా నేటికీ అధికారుల్లో కదలిక లేదని రైతులు ఆవేధన చెందుతు న్నారు.

Share
Share