Breaking News: బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య.. మూడు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కి…

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట మండలం యర్కారం గ్రామం రాజకీయ ద్వేషంతో మరోమారు భగ్గుమంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, గ్రామ మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా హతమార్చారు. నిందితులు హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో మూటగట్టి, యర్కారం స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన పడేసి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు.

శనివారం ఉదయం స్థానికులు ఆ గోనె సంచిని గమనించి, లోపల శవం ఉండటాన్ని చూసి భయాందోళనలతో లోకల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి (Suryapet General Hospital) మార్చురీకి తరలించారు.

అయితే, ఈ హత్యకు సంబంధించి కొన్ని నమ్మసకలిగని కీలక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు పాత హత్య కేసుల్లో మృతుడు చింతలపాటి మధు కూడా నిందితుడిగా (Accused) ఉన్నట్లు సమాచారం. ఈ పాత కక్షల నేపథ్యంలోనే ప్రత్యర్థులు పక్కా స్కెచ్ వేసి మధును లేపేశారా? లేక దీని వెనుక మరేదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

మరోవైపు తన భర్తను కేవలం రాజకీయ ద్వేషంతోనే, ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం ప్రత్యర్థులు అంతమొందించారని మృతుడి భార్య (మాజీ సర్పంచ్) కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో యర్కారం గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తక్షణమే స్పందించి, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రతిదాడులు జరగకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

యర్కారం గ్రామంలో వరుసగా జరుగుతున్న ఈ హత్యా రాజకీయాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాత కేసుల గొడవలు, రాజకీయ ఆధిపత్య పోరు వెరసి ఒకరి ప్రాణాలను మరొకరు తీసుకునే స్థాయికి వెళ్లడం దారుణమైన విషయం. పోలీసులు కేవలం బందోబస్తుకే పరిమితం కాకుండా, ఈ హత్యకు కారణమైన అసలు సూత్రధారులు, పాత్రధారులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ‘ఏపీబీ న్యూస్’ డిమాండ్ చేస్తోంది.

Share
Share