APB News Exclusive: నల్లగొండ ఐసీడీఎస్‌(ICDS)లో… టెండర్ ఒరిజినల్.. సప్లై డూప్లికేట్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో అంగన్ వాడీ సెంటర్లకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ ల సప్లైలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టెండర్లలో ఒరిజినల్ బ్రాండ్లను చూపించి, చీప్ క్వాలిటీ మోడళ్లు సప్లై చేశారని తెలిసింది. సుమారు రూ.20 లక్షల టెండర్లలో రూ.10 లక్షల నిధులు దారి మళ్లించారనే చర్చ ఐసీడీఎస్(ICDS) వర్గాల్లో జోరుగా సాగుతోంది. మార్చిలో టెండర్లు జరిగితే ఏప్రిల్ లో సప్లై చేయాల్సిన కాంట్రాక్టర్, సెంటర్లు మూతపడ్డ వేసవి సెలవుల్లో సప్లై చేయడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని 802 అంగన్ వాడీ సెంటర్లకు క్రాప్టన్(Crompton) ఫ్యాన్లు, పిలిప్స్(Philips) ట్యూబ్లైట్లు సప్లై చేసేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. జిల్లా పర్చేజ్ కమిటీ ఆధ్వర్యంలో ఒరిజినల్ శాంపిల్స్ను చూపించిన ఏజెన్సీ, నాసిరకమైన బ్రాండ్లను సప్లై చేసింది.

టెండర్ల నిబంధనల్లో క్రాప్టన్ హైస్పీడ్ హెచ్పీ ప్లస్(Crompton High Speed HP Plus) 1200 ఎంఎం(mm) (148 ఇం చులు) ఓపెల్ వైట్ మోడల్ ఫ్యాన్ సప్లై చేయాలి. టెండర్ కొటేషన్లో ఒక్క ఫ్యాన్ ఖరీదు రూ.2,243.43 కోట్ చేశారు, కానీ సప్లై చేసిన ఫ్యాన్ మోడల్ సీవైండ్. కాగా, 120 ఎంఎం. ఓపల్ వైట్. క్రాప్టన్ బ్రాండ్లో ఈ మోడల్ నాసిరకమైందని చెప్తున్నారు. మార్కెట్లో రూ.1400లకే లభిస్తుందని చెప్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఫ్యాన్ ఖరీదులోనే రూ.843లు వ్యత్యాసం కనిపిస్తోంది. జిల్లాలో 802 సెంటర్లకు సప్లై చేశారు. దీన్నిబట్టి ఫ్యాన్లు కొనుగోలు చేయడంలోనే సుమారు రూ.7 లక్షల గోల్మాల్ జరిగింది. ఫిలిప్స్ ట్యూబ్లైట్ సెట్ 20 వాట్స్, త్రీ ఇన్ వన్ ఎల్ఈడీ(LED) మోడల్ సప్లై చేయాలి, కానీ ఫిలిప్స్ బ్రాండ్లో అత్యంత నాసిరకమైన స్లిమ్ మోడల్ ట్యూబ్లైట్ సప్లై చేశారని చెప్తున్నారు. త్రీ ఇన్ వన్ కాకుండా స్లిమ్ మోడల్ చేయడంతో సుమారు రూ. 2లక్షల గోల్మాల్ జరిగింది. టెండర్ కొటేషన్లో త్రీ ఇన్ వన్ క్వాలిటీ ట్యూబ్లైట్ ఖరీదు రూ.264 నిర్ణయించారు. అయితే ఏజెన్సీ సప్లై చేసిన స్లిమ్ మోడల్ ట్యూబ్లైట్ మార్కెట్లో రూ.110లకే లభిస్తుంది. ఈ లెక్కన ఒక్క ట్యూబ్లైట్ ధరలోనే రూ.154 వ్యత్యాసం కనిపిస్తోంది. 1060 సెంటర్లతో రూ.154లు లెక్కిస్తే దాదాపు రూ.రెండు లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది.

జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నిర్వాహం వల్లే ఇదంతా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. నకిరేకల్ సీడీపీఓలో పనిచేయాల్సిన సదరు ఉద్యోగి డిప్యూటేషన్ పైన గత కొన్నేళ్ల నుంచి జిల్లా ఆఫీసులోనే తిష్టవేసిండని చెప్తున్నారు. ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదనే సాకును అడ్డంపెట్టుకుని కాంట్రాక్టు వ్యవహారాల్లో బినామీ పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. ఫ్యాన్లు, ట్యూబ్లైట్ల కాంట్రాక్టు వెనక అసలు సూత్రదారి అతడేనని అంటున్నారు. హైదరాబాద్లో తనకు తెలిసిన వ్యక్తులతో బినామీ టెండర్లు వేయించి, సప్లై వ్యవహారమంతా అతని కనుసన్నల్లోనే జరిగిందని అంటున్నారు.

మార్చిలో టెండర్లు జరిగితే ఏప్రిల్ లో సప్లై చేయాలన్నది అగ్రిమెంట్, కానీ వేసవి సెలవుల్లో సప్లై చేయడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం అంగన్ వాడీ సెంటర్ల వరకు ఫ్యాన్లు, లైట్లు సప్లై చేయాలి, కానీ సెలవుల్లో సెంటర్లు బంద్ ఉంటాయని పసిగట్టి చీప్ క్వాలిటీ మెటీరియల్ సప్లై చేస్తున్నారు. నిజానికి సప్లై చేయడానికి ముందు మెటీరియల్ ను జిల్లా కొనుగోలు కమిటీ పరిశీలన చేయాల్సి ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా డైరక్ట్ సెక్టార్ ఆఫీసుల్లో పడేస్తున్నారు. ప్రతి 20 సెంటర్లకు ఇంచార్జిగా ఉండే సూపర్వైజర్లతో మెటీరియల్ ముట్టినట్టు సంతకాలు తీసుకుంటున్నారే తప్పా క్వాలిటీ గురించి ఎవరూ అడగటం లేదు. దీంతో అనుమానం వచ్చిన పలువురు సూపర్వైజర్లు ఆరా తీయగా అసలు బండారం బయట పడింది. కొన్ని సెంటర్లకు పిలిప్స్ బదులు, క్రాంప్టన్ టూబ్లైట్లు కూడా సప్లై చేస్తున్నారని తెలిసింది.

అంగన్ వాడీ సెంటర్లను విజిట్ చేసిన కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకుని కనీస మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిధులతో ప్రమేయం లేకుండా కలెక్టర్ ఖాతాలో ఉండే మినరల్ ఫండ్స్తో కొనుగోలు చేయాలని టెండర్లు పిలిచారు. అంగన్ వాడీ సెంటర్ల వరకు మెటీరీయిల్ సప్లై చేస్తే, వాటిని ఫిట్టింగ్ చేయడానికి అవసరమయ్యే ఖర్చులను కూడా కలెక్టర్ రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కలెక్టర్ సంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఇదే రకంగా అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేశారని, ఇక్కడ కూడా అదే పద్ధతిలో టెండర్లు పిలిచి, మెటీరియల్ సప్లై చేయాలని భావించారని, కానీ ఉద్యోగుల నిర్వాహక వల్ల మినరల్ ఫండ్స్ దారి మళ్లించడం వివాదస్పదంగా మారింది.

Share
Share