Breaking News: ఘోరం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కసాయి తల్లి..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తల్లి ప్రేమను, నమ్మకాన్ని కాలరాస్తూ కన్నతల్లే కాలయమురాలిగా మారిన హృదయవిదారక సంఘటన రాజధాని నగరం హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లి, మద్యం మత్తులో కసిగా ప్రాణాలు తీసింది. 9 నెలల పసిపాపను చెరువు నీటిలో ముంచి దారుణంగా హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ ప్రాంతానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధతో కలిసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్గూడ ‘గూడా చెరువు’ వద్దకు వచ్చింది.

అనంతరం ఏమాత్రం కనికరం లేకుండా 9 నెలల చిన్నారి అనురాధను చెరువు నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మద్యం మత్తులోనే దారుణం: పసిపాపను చెరువులో ముంచి హత్య చేసే సమయంలో నిందితురాలు రాజేశ్వరి తీవ్రస్థాయిలో మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

పోస్టుమార్టానికి తరలింపు: చిన్నారి అనురాధ మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు: కసాయి తల్లి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యకు గల పూర్తి కారణాలపై తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే మద్యం మత్తులో 9 నెలల పసిపాపను పొట్టనబెట్టుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం, దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్నాయి.

Share
Share