- వడ్ల రవాణాలో ఇబ్బంది పెడితే సహించేది లేదు..
- సీఎం రేవంత్ ఆదేశాలతో కదిలిన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు
- లారీల సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నయ చర్యలు
- ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లతో చర్చిస్తున్న జిల్లా కలెక్టర్
- ఇసుక, సిమెంట్ లారీలు, ట్రాక్టర్లను దారిమళ్లిస్తున్న అధికారులు
- లారీ కాంట్రాక్టర్ల నిర్వాహం పైన ఏపీబీ న్యూస్ లో వరుస కథనాలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లను రవాణా చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు. లారీలు సప్లై చేయకుండా కాంట్రాక్టర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, మిల్లర్లు వడ్ల దింపుకోకుండా జాప్యం చేస్తున్నారని అధికారులు, ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. దీని పైన మంత్రి ఉత్తమ్ ఘాటుగానే స్పందించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. వడ్ల రవాణా స్పీడప్ చేసేందుకు రోడ్ల పైన తిరిగే ప్రైవేటు వాహనాలను దారి మళ్లించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆర్టీఓ(RTO), పోలీస్, రెవిన్యూ సహకారంతో సిమెంట్ లారీలు, ఇసుక లారీలు, ట్రాక్టర్లను వడ్ల కేంద్రాలకు దారిమళ్లించాలని ఆదేశించారు. స్థానికంగా ఉండే లారీల అసోసియేషన్లతో చర్చించి లారీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతో నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కొండమల్లేపల్లి హైవే మీద రాకపోకలు సాగించే లారీలను గుర్రంపోడు వైపుకు మళ్లించారు. చండూరు ఇసుక రీచ్‌లో తిరిగే ట్రాక్టర్లను మునుగోడుకు దారిమళ్లించారు. బుధవారం రాత్రి మాడ్డులపల్లి వద్ద ఆపిన 18 లారీలను తిప్పర్తి, కనగల్ సెంటర్లకు పంపించారు.

పెరిగిన లారీలు.. కదిలిన వడ్లు..
సీఎం రేవంత్ ఆదేశాలతో జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు రంగంలోకి దిగారు. కాస్తంతా ఆలస్యమైనప్పటికీ సీఎం స్పందించడంతో జిల్లా అధికారులు, మంత్రుల్లో కదలిక వచ్చింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలైన కొనుగోళ్లు 60 శాతం పూర్తియ్యాయి. బ్యాలెన్స్ 40 శాతం వడ్లు తరలించడం అధికారులకు మరింత కష్టమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. దీంతో గత మూడు రోజుల నుంచి జిల్లాలో లారీలు పెరిగాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లు రవాణా ఊపందుకున్నాయి. టెండర్లలో 820 లారీలు నల్లగొండ జిల్లాకు కేటాయించినట్టు చెప్తున్నా అవన్నీ కాకిలెక్కలే అని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ నెల 5న 337 లారీల తోనే వడ్ల రవాణా జరిగింది. సీఎం హెచ్చరించిన నాటి నుంచి లారీల సంఖ్య 397కు పెరిగింది. బుధవారం ఏకంగా 457 లారీలు రోడ్ల పైకొచ్చాయి. మరి ఇన్నాళ్లు ఈ లారీలు ఎక్కడికి వెళ్లాయనే సంగతి మాత్రం ఎవరికీ పట్టలేదు. కొద్దిరోజుల క్రితం వరకు ఐకేపీ సెంటర్లకు రోజుకు 30-70 లారీలు మాత్రమే వెళ్లేవి. ఇప్పుడు వాటి సంఖ్య 130కి పెరిగింది. మూడు రోజుల ముందు వరకు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల నుంచి రోజుకు 12, 14 వేల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కాంటాలు అయ్యేవి. లారీలు పెరగడంతో గురువారం ఏకంగా 23 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కాంటాలు అయ్యాయి. మిల్లుల వద్ద కూడా దిగుమతుల్లో వేగం పుంజుకుంది. వడ్లు దిగుమతి చేసేందుకు మిల్లుల వద్దకు చేరిన 263 లారీల్లో 253 లారీలు వడ్లు అన్లోడ్ కావడం గమనార్హం. లారీల రవాణాలో జరుగుతన్న మోసం గురించి ఏపీబీ న్యూస్ లో వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీని పైన స్పందించిన జిల్లా మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం విశేషం.