Breaking News: కర్నాటకలో డీకే శివ కుమార్.. ఇక్కడ నేను: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కర్నాటకలో డీకే శివ కుమార్, తెలంగాణలో నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఊరూరు తిరిగి కష్టపడ్డ వాళ్లమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం తిప్పర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన శివ కుమార్ సీఎల్పీ నేతగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మా ఇద్దరి వయసు 62 ఏళ్లే అని, ఎన్ఎస్యూఐ(NSUI), యూత్ కాంగ్రెస్ లో పని చేశామని, పార్టీ అభ్యున్నతి కోసం శివ కుమార్ కారు, బైక్, హెలికాప్టర్ లో ఊరూరు తిరిగి కష్టపడ్డారని, అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఊరూరు తిరిగి పార్టీని బలోపేతం చేశానని మంత్రి చెప్పారు. సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన మాటకు కట్టుబడి పదవికి రాజీనామా చేయడం రాజకీయ నిబద్ధతకు నిదర్శనమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతటి గొప్ప నాయకుడని కొనియాడారు. దేశంలో 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు.

బీజేపీ లీడర్లు బస్సు యాత్రకు బదులు పాదయాత్ర చేస్తే బెటర్ అని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 90 లక్షల టన్నుల వడ్లను కేంద్రం కొనుగోలు చేసేలా రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీని ఒప్పిస్తే అన్ని గ్రామాల్లో బీజేపీ నాయకులకు పాలాభిషేకం చేస్తామని మంత్రి చెప్పారు. కాబట్టి బీజేపీ లీడర్లు బస్సు యాత్ర చేస్తే లాభం లేదని, పాదయాత్ర చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ ఎప్పుడైతే టీ(T) నుంచి బీ(B)కి మారిందో అప్పుడే ఆ పార్టీ బొందలగడ్డ పార్టీగా మారుతుందనే సంగతి ఎప్పుడో చెప్పానని తాను చెప్పిందే జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ‘నేను కార్లో తిరిగినా, బైక్ మీద తిరిగి నా.. హెలికాప్టర్లో తిరిగినా.. ఎట్లా తిరిగినప్పటికీ జిల్లా అభివృద్ధి కోసమే అని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఏనాడు ఎంజీ యూనివర్సిటీలో కాలుమోపలేదని పరోక్షంగా విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి చేశామని, 2028 నాటికి ఎస్ఎల్బీసీ(SLBC) పూర్తిచేసి ఎన్నికలకు వెళతామని చెప్పారు. కనగల్ లో రూ.2 కోట్ల సీఎస్సార్(CSR) ఫండ్స్తో హైస్కూలను మోడల్ స్కూల్ గా తీర్చి దిద్దుతామని ప్రకటించారు.

మిషన్ భగీరథ స్కీం అట్టర్ ప్లాప్ అయ్యిందని మంత్రి చెప్పారు. ఫ్లోరైడ్ గ్రామాల్లో తాగునీటి పరిష్కారం కోసం ఆనాడు జి ఎడవల్లి లాంటి గ్రామాల్లో ప్రత్యేకంగా ప్లాంట్లు ఏర్పాటు చేసి 70 గ్రామాలకు నీటిని సప్లై చేశామని, కానీ బీఆర్ఎస్ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు ఖర్చు చేసి ప్లాంట్లను మూతపడేసిందని అన్నారు. దీంతో గ్రామాల్లోకి సప్లై చేస్తున్న నీళ్లు ఫిల్టర్ కావడం లేదని, నీళ్లలో రుచి కూడా తేడా ఉందని, అప్పటి నీళ్లకు, ఇప్పటి నీళ్లలో తేడా ఉందని మంత్రి చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 6 వేల కోట్లు భగరీథ స్కీం పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని, ఆ స్కీంను అడ్డం పెట్టుకుని కమీషన్లు దండుకున్నారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.

Share
Share