Big Breaking News: “ఈటెల ఏడుపే బీజేపీకి శాపం” బీజేపీలో ‘ఫ్లెక్సీ’ల కలకలం..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: తెలంగాణ బీజేపీలో అప్పుడే ముసలం పుట్టిందా? ఎంపీల గెలుపు జోష్లో ఉన్న కాషాయ దళంలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్కు చేరాయా? అంటే అవుననే అంటున్నాయి మేడ్చల్ పరిధిలో తాజాగా వెలిసిన ఫ్లెక్సీలు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరుతో.. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తూ మేడ్చల్లోని పలు ప్రధాన చౌరస్తాల్లో వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారాయి.

మేడ్చల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో ఈటెల రాజేందర్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు ముద్రించారు. అందులోని ప్రధానాంశాలు ఇవే:

పదవుల కోసం ఏడుపు: “ఈటెల ఏడుపే బీజేపీకి శాపం” అంటూ హెడ్డింగ్ పెట్టి.. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు.. ఇలా అన్నింటికీ ఈటెల అసంతృప్తి వెళ్లగక్కుతున్నారంటూ పోస్టర్లలో ఎద్దేవా చేశారు.

పార్టీ ఎంతో ఇచ్చింది: బీజేపీ ఈటెలకు రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని, అక్కడ ఓడిపోయినా సరే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిందని గుర్తు చేశారు.

మోదీ ఇమేజ్ కాదా?: దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆయన ఇమేజ్తో గెలిచాక కూడా.. “నా సొంత ఇమేజ్ తోనే గెలిచాను” అని ఈటెల అనడం ఏ రకమైన రాజకీయ నైతికత అని ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు.

ఈ అంతర్గత పోరులో సామాజిక వర్గాల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. “బీజేపీలో ఇతర బీసీ నాయకులు ఎదుగుతుంటే ఈటెలకు అసహనం ఎందుకు?” అని ప్రశ్నిస్తూ.. ఇందూరు బిడ్డగా నిజామాబాద్లో ఎంపీ అరవింద్కు వస్తున్న ప్రజాదరణ చూసి కడుపుమంట ఎందుకు? అని నిలదీశారు. నేనే పెద్ద బీసీ నాయకుడిని… నేనే ప్రత్యామ్నాయం” అనే భ్రమల నుంచి ఈటెల రాజేందర్ ఇకనైనా బయటకు రావాలంటూ మేడ్చల్ వ్యాప్తంగా వెలిసిన ఈ ఫ్లెక్సీలు బీజేపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశాయి.

తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీకి.. ఎంపీల మధ్య సాగుతున్న ఈ అంతర్గత యుద్ధం పెద్ద మైనస్ కానుంది. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇద్దరూ కూడా పార్టీలో బలమైన నేతలే. మేడ్చల్ లాంటి కీలక ప్రాంతంలో నేరుగా ఎంపీ అరవింద్ పేరిట ఫ్లెక్సీలు రావడం వెనుక అసలు కథ ఏంటనేది సస్పెన్స్గా మారింది. ఇది నిజంగానే అరవింద్ వర్గీయులు ఏర్పాటు చేశారా? లేక ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెంచేందుకు ప్రత్యర్థి పార్టీలు ఆడిన డ్రామాయా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధిష్టానం, ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share
Share