APB News Exclusive: ఒరిజినల్ కాంగ్రెస్‌కు రాజగోపాల్ అండ!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా రాజకీయ వ్యూహం చర్చనీయాంశంగా మారింది. నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు వైఖరిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి. వలస పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం కారణంగా ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్ అణచివేతకు గురవుతోందని, తమకే చెందిన నాయకులపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కేవలం నకిరేకల్, తుంగతుర్తికే పరిమితం కావని, ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు కాంగ్రెస్ కేడర్లో చర్చ జరుగుతోంది. వలస నేతలకే అధిక ప్రాధాన్యం లభిస్తుండగా, పార్టీ కోసం ఎన్నేళ్లుగా పనిచేసిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా పక్కన పెడుతున్నారనే అసంతృప్తి ఎక్కువైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ వర్గపోరు రాజకీయాల విషయంలో ఇప్పటివరకు బహిరంగంగా జోక్యం చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. గాంధీభవన్ లో జగ్గారెడ్డిని కలిసి మంత్రి కోమటిరెడ్డి తుంగతుర్తి వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడం లేదని భాహాటంగానే ప్రకటించారు. ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్గానే ఉన్నారు. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, గుడిపాటి నర్సయ్య మంత్రిని కలిసి తుంగతుర్తి పరిస్థితుల గురించి వివరించినట్టు తెలిసింది. అలాంటి సమయంలో తొలిసారి రాజగోపాల్ రెడ్డి ఈ అంశాన్ని బహిరంగంగా లేవనెత్తడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అణచివేతకు గురవుతున్నామని భావిస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్ను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేక ఉమ్మడి జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుట్టే సంకేతాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి.

భువనగిరి పార్లమెంట్ మాజీ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ ప్రాంతంలో రాజకీయంగా బలమైన పట్టుంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును కాంగ్రెస్లోకి తేవడంలోనూ, ఎమ్మెల్యేలుగా గెలిపించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, ప్రస్తుతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై వ్యక్తమైన ఆరోపణల తరహాలోనే ఇప్పుడు వీరేశం, సామేలు వ్యవహారశైలి మారిందనే విమర్శలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కేడర్కు ప్రాధాన్యం తగ్గించడం, వర్గపోరును ప్రోత్సహించడం, పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టడం వల్ల కాంగ్రెస్కే రాజకీయంగా నష్టం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుంగతుర్తిలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదు. మండల కమిటీల నియామకాల సందర్భంగా ఎమ్మెల్యే సామేలు వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ కేడర్ గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. అనంతరం తుంగతుర్తి వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి పార్టీ అప్పగించింది. అదే తరహాలో నకిరేకల్ నియోజకవర్గంలోనూ అంతర్గత విభేదాలు ముదురుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిట్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి సోదరుల జోక్యాన్ని రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని వారి అనుచరులు ఆరోపిస్తున్నారు. తాజాగా మండల కమిటీల ఏర్పాటులోనూ తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భువనగిరి పార్లమెంట్ పరిధిలో కోమటిరెడ్డి సోదరుల రాజకీయ ప్రభావంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్ను ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్టీలో తమ రాజకీయ బలం మరింత పటిష్ఠం చేసుకునే దిశగా రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే దీన్ని బట్టి తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్కూ ఎదురవుతున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. భువనగిరి లోక్సభ స్థానం గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదన్న అసంతృప్తి రాజగోపాల్లో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే తరహాలో, బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలను గెలిపించేందుకు కష్టపడ్డ ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్కు ఇప్పుడు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల కేటాయింపులో జరిగినట్లే, భవిష్యత్తులో సహకార సంఘాలు, కార్పొరేషన్ల డైరెక్టర్, చైర్మన్ పదవుల పంపకాల్లోనూ తమకు అన్యాయం జరిగే అవకాశముందనే ఆందోళన కేడర్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మరో మూడేళ్ల వరకు ప్రధాన ఎన్నికలు లేకపోవడంతో ప్రస్తుతం ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని పార్టీ కేడర్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అండగా ఉంటారనే నమ్మకంతో అసంతృప్తి కేడర్ కొంతకాలం ఓపిక పట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share
Share