APB News Exclusive: నాగార్జునసాగర్ లో ఆరు టీఎంసీలే..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు ఆరు టీఎంసీలకే పరిమితమవడంతో మరో మూడు నెలల తర్వాత తాగునీరు, సాగు నీటి సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. శ్రీశైలం జలాశయానికి గణనీయమైన వరదలు వస్తే తప్ప సాగర్లోకి కొత్తగా నీరు చేరే అవకాశం కనిపించడం లేదు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నీటిపారుదల శాఖ అప్రమత్తమైంది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 513 అడుగుల వద్దకు పడిపోయింది. ప్రస్తుతం జలాశయంలో వినియోగానికి అందుబాటులో ఉన్న నిల్వలు కేవలం ఆరు టీఎంసీలే. ఈ పరిస్థితుల్లో ఎడమకాల్వ ఆయకట్టుతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎంఆర్) ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నల్లగొండ జిల్లా, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ద్వారా రోజుకు మొత్తం వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇందులో 700 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్కు సరఫరా చేస్తుండగా, 300 క్యూసెక్కుల చొప్పున అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. రానున్న రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం మరింత తగ్గితే, ఫోర్షోర్ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరదలు వచ్చి, అక్కడి నుంచి నాగార్జునసాగర్కు నీటి విడుదల జరిగితేనే.. పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రస్తుతం రెండు మోటార్లే నడుస్తున్నవి. మొత్తం నాలుగు మోటార్లలో నాలుగో మోటరు నడిచే పరిస్థితి లేదు. మూడు మోటార్లలో రెండు మోటర్లు నడిపిస్తున్నారు. నాగార్జునసాగర్ లో నీటి మట్టాలు 513 అడుగులకు చేరడంతో మూడో మోటారు నడిపించే అవకాశం లేకుండా పోయింది. ఒక మోటార్ నుంచి హైదరాబాద్ సీటీకి, రెండో మోటారు నుంచి నల్లగొండ ఉదయ సముద్రానికి నీటిని పంపింగ్ చేస్తున్నారు. మూడో మోటారులో ఇటీవల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ట్రాన్స్ఫార్మర్లు తెప్పించి రిపేరు చేశారు. కానీ మళ్లీ సాగర్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరుకునేలోగా మూడో మోటారులో తలెత్తిన సాంకేతిక సమస్యలు మళ్లీ పునారవృతం కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది.

నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 513 అడుగుల నుంచి 510 అడుగులకు పడిపోతే తాగునీటి సరఫరాపై మరింత ఒత్తిడి ఏర్పడనుంది. 510 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్)కు గ్రావిటీ ద్వారా నీరు చేరదు. దీంతో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్ ఫోర్షోర్–పుట్టంగండి పంపింగ్ వ్యవస్థలోని మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి ఏకేబీఆర్కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు సాగర్ లో 495 అడుగుల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోసి హైదరాబాద్ కు తరలించారు. రోజుకు 900 క్యూసెక్కులు రిజర్వాయర్ నుంచి డ్రా చేసి ఏకేబీఆర్ కు తరలించారు. దీంట్లో 600 క్యూసెక్కులు సిటీకి, 300 క్యూసెక్కులు నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు సప్లై చేశారు. ఇప్పుడు కూడా దాదాపు అవే పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరకముందే తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే దిగువకు నీటి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, జూరాల జలాశయాల్లో నీటి నిల్వలు సుమారు 80 శాతానికి చేరుకున్నాయి. మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు రెండు నుంచి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఒప్పించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ఇరిగేషన్ వర్గాలు వెల్లడించాయి.

Share
Share