- నల్లగొండ కాంగ్రెస్లో కలకలం
- సముచిత స్థానం దక్కలేదంటూ ఉపాధ్యక్ష పదవి పైన అబ్బగోని రమేష్ గౌడ్ తీవ్ర అసంతృప్తి
- నుడా చైర్మన్ హామీతో ఆశపెట్టి పార్టీ పదవితో సరిపెట్టే ప్రయత్నం
- మంత్రి కోమటిరెడ్డిని సంప్రదించకుండా కమిటీలో మార్పులంటూ.. కైలాష్పై మంత్రి వర్గం ఫైర్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటనతో నల్లగొండ కాంగ్రెస్లో కొత్త వివాదానికి తెర లేచింది. పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్కు జిల్లా కమిటీలో తగిన గుర్తింపు లభించలేదనే అసంతృప్తి బహిర్గతమైంది. జిల్లా ఉపాధ్యక్ష పదవిని ఆయన తిరస్కరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ పరిణామంతో జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నాలుగు టర్మ్ లు కౌన్సిలర్గా ఎన్నికై, పట్టణ కాంగ్రెస్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన రమేష్ గౌడ్కు నుడా(NUDA) చైర్మన్ పదవి వస్తుందనే ఆశలు చాలా కాలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ పదవి ఇవ్వకుండా జిల్లా ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనను పక్కన పెట్టేందుకు కొందరు పావులు కదుపుతున్నారని, వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి జాబితాలో ముగ్గురే.. కమిటీలో ఐదుగురు..!
డీసీసీ కమిటీలో మొత్తం పది మంది ఉపాధ్యక్షులను నియమించగా, వారిలో ఐదుగురు నల్లగొండ పట్టణానికి చెందినవారే కావడం చర్చనీయాంశమైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రతిపాదించిన జాబితాలో అబ్బగోని రమేష్ గౌడ్, కత్తుల కోటి, చింతకుంట్ల రవీందర్రెడ్డి పేర్లు మాత్రమే ఉన్నాయని, అయితే కిన్నెర శ్రీనివాస్, ఎండీ ముంతాజ్ అలీల పేర్లను మంత్రి అనుమతి లేకుండానే కమిటీలో చేర్చారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ వ్యవహారశైలిపై మంత్రి అనుచరుల్లో చాలా కాలంగా అసంతృప్తి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానంపై ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆ అవకాశం లేదని తెలుస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేల అంగీకారంతోనే పార్టీ అధిష్ఠానం కైలాష్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు ఆయనపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల ప్రకటించిన జిల్లా కమిటీలో మంత్రి కోమటిరెడ్డిని సంప్రదించకుండానే కిన్నెర శ్రీనివాస్, ఎండీ ముంతాజ్ అలీలను ఉపాధ్యక్షులుగా నియమించడం అనవసర వివాదాలకు దారితీసిందనే చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది. మరోవైపు, మంత్రి ప్రతిపాదించిన జాబితాలోని ఒకరిద్దరికి వారి రాజకీయ స్థాయికి మించి ప్రాధాన్యం కల్పించారని, పార్టీ కార్యక్రమాలతో పెద్దగా సంబంధం లేని, ప్రజాదరణ లేని వారిని సిఫారసు చేశారని కైలాష్ వర్గం ఆరోపిస్తోంది. దీనికి కౌంటర్ గ కిన్నెర శ్రీనివాస్, ఎండీ ముంతాజ్ అలీ లు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో పనిచేస్తున్న నాయకులేనని, జిల్లా కేంద్రం లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నందున వారి సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యక్ష పదవులు కల్పించామని కైలాష్ వర్గం వివరిస్తోంది. అయితే ఒకే నియోజకవర్గానికి చెందిన ఐదుగురిని ఉపాధ్యక్షులుగా నియమించడం వల్ల కమిటీలోని ఇతర నాయకుల ప్రాధాన్యం తగ్గిపోయిందని, సీనియారిటీకి తగిన గౌరవం దక్కలేదని మంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
నుడా హామీ.. ఇప్పుడు ఉపాధ్యక్ష పదవేనా?
నుడా చైర్మన్ పదవి ఇస్తామని ఆశ చూపి, చివరకు పార్టీ ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టాలని ప్రయత్నించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని రమేష్ వర్గం ఆరోపిస్తోంది. డబ్బుల కోసం పార్టీలు మారే నాయకులుగా తమను చిత్రీకరించి రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, అదే వ్యూహంలో భాగంగానే జిల్లా కమిటీలోనూ రమేష్ గౌడ్ ప్రాధాన్యాన్ని తగ్గించేలా వ్యవహరించారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేని వ్యక్తులకు సైతం ఉపాధ్యక్ష పదవులు ఇచ్చి, సీనియర్ నాయకుడైన రమేష్ గౌడ్ను వారితో సమానంగా నిలబెట్టడం ద్వారా ఆయన రాజకీయ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారని వారు మండిపడుతున్నారు. ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్లో కొత్త వర్గపోరుకు దారితీసే అవకాశముందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పీసీసీ ఉపాధ్యక్ష పదవిని గుమ్మల మోహన్ రెడ్డి తిరస్కరించినట్టుగానే జిల్లా ఉపాధ్యపదవి తనకు వద్దని, సీనియర్లు చాలా మంది ఉన్నందున వాళ్లకు ఇవ్వమని రమేష్ గౌడ్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే జిల్లా కమిటీలో కొత్తగా మరొక 40 మందికి చోటు కల్పించనున్నారు. మునుగోడు, మిర్యాలగూడ ఎమ్మెల్యేల ప్రతిపాధనలు ఇంకా రాలేదు. వీటితోపాటు నకిరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండ ఎమ్మెల్యేలు సైతం ఇంకొంత మంది పేర్లను జిల్లా కమిటీలో చేర్చాలని పీసీసీని కోరడం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు ప్రకటించిన 64 మందితోపాటు, మరొక 40 మంది పేర్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో నల్లగొండ జిల్లా కమిటీ జంబో కార్యవర్గంతో నిండిపోనుంది.