- నల్లగొండ విద్యాశాఖకు కొత్త సారథి పోపూరి సుశీంద్రరావు
- సెంట్రల్ జైలులో డిప్యూటీ జైలర్గా 8 ఏళ్ల సేవలు..
- 18 ఏళ్లుగా వివిధ జిల్లాల్లో డీఈఓగా అనుభవం
- ప్రతి రోజు ఓ పాఠశాల ప్రార్థనలో పాల్గొనడం అలవాటు
- మారుమూల ప్రాంతాల స్కూళ్ల బలోపేతం చేయడమే లక్ష్యం
- కొత్త డీఈఓ(DEO) తో ఏపీబీ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాకు విద్యాశాఖ కొత్తగా నియమించిన డీఈఓ(DEO) పి.సుశీంద్ర రావు ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనది. సెంట్రల్ జైళ్లలో డిప్యూటీ జైలర్గా ఎనిమిదేళ్లు పని చేసిన ఆయన, 2008లో విద్యాశాఖలోకి అడుగుపెట్టి అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. గత 18 ఏళ్లుగా వివిధ జిల్లాల్లో డీఈఓగా సేవలందిస్తూ విద్యా రంగంలో తనదైన ముద్ర వేశారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రార్థన కార్యక్రమానికి హాజరవడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెబుతున్న కొత్త డీఈఓ పి.సుశీంద్ర రావుతో ఏపీబీ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ.
జైలర్గా మొదలైన ప్రస్థానం..
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన నల్లగొండ డీఈఓ పోపూరి సుశీంద్రరావు ప్రస్థానం సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రారంభమైంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆయన కృషి చేశారు. ఆ ప్రయత్నానికి 1999లో ఫలితం దక్కింది. అదే ఏడాది నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ జైలర్ పోస్టుకు ఎంపికయ్యారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జైలులో తొలి పోస్టింగ్ పొందారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఐదేళ్లు, రాజమండ్రి సెంట్రల్ జైలులో మరో ఐదేళ్లు, నర్సరావుపేట సబ్జైలులో ఆరునెలల పాటు విధులు నిర్వహించారు. డిప్యూటీ జైలర్గా సేవలందిస్తున్న సమయంలోనే ఆయన ప్రతిభ, పరిపాలనా నైపుణ్యాలను గుర్తించిన సహచరులు, ఉన్నతాధికారులు మరింత ఉన్నత స్థాయిలో సేవలందించాలంటూ ప్రోత్సహించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్మెడల్ సాధించిన సుశీంద్రరావు విద్యారంగంపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. వాస్తవానికి జైలు శాఖలో చేరకముందే సివిల్ సర్వీసుల వైపు అడుగులు వేయాలనుకున్నప్పటికీ, కుటుంబ పరిస్థితుల కారణంగా వచ్చిన తొలి ప్రభుత్వ ఉద్యోగానికే ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు జైలు శాఖలో సేవలందించిన అనంతరం 2008లో నిర్వహించిన డిప్యూటీ డీఈఓ పరీక్షలో ఎంపికై విద్యాశాఖలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
ఓల్డ్ సిటీతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభం..
జైలు శాఖకు వీడ్కోలు పలికిన సుశీంద్రరావు 2008లో విద్యాశాఖలో డిప్యూటీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. తొలి పోస్టింగ్గా హైదరాబాద్ నగరంలోని చార్మినార్ ప్రాంతంలో విధులు చేపట్టారు. 2008 నుంచి 2016 వరకు దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఓల్డ్ సిటీలోనే వివిధ హోదాల్లో సేవలందించారు. ఈ కాలంలో హైదరాబాద్ ఇన్చార్జి డీఈఓగా, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. 2016లో జిల్లాల పునర్విభజన అనంతరం వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి గద్వాల జిల్లాలో డీఈఓగా సేవలందిస్తూ గ్రామీణ విద్యాభివృద్ధికి కృషి చేశారు. 2021లో రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన ఆయన, పట్టణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, పదో తరగతి ఫలితాల మెరుగుదల, ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించారు.

డీఈఓలు అడుగుపెట్టన ప్రాంతాల్లో పర్యటించా…
వనపర్తి, గద్వాలలో డీఈఓలు అడుపెట్టని మారమూల ప్రాంతాల్లోని స్కూళ్లను విజిట్ చేశా. కృష్ణా నదీ సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను సందర్శించి వాటి అభివృద్ధి కృషి చేశాను. మా కుటుంబంలో ఉదయమే ప్రార్ధన చేయడం సంప్రదాయంగా వస్తోంది. అదే ఆచారం నాజీవితంలో ముఖ్యమైన దినచర్యగా మారింది. ప్రతి రోజు ఉదయం ఏదో ఒక స్కూల్లో కచ్చితంగా ప్రేయర్ లో పాల్గొంటా. ఆఫీసులో ఉండటం తక్కువ. ఫీల్డ్లో ఉండటమే ఎక్కువ. డీఈఓగా క్షేత్రస్థాయిలో పర్యటించడానికే నేను ఇష్టపడతాను. ‘పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడే వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు సమర్థవంతంగా తీసుకోవచ్చు. నా 18 ఏళ్ల సర్వీసులో ఇదే నా విజయ రహస్యం. రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన సమయంలో పట్టణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంచేందుకు శాయశక్తులా కృషి చేశాను. అలాగే పదో తరగతి ఫలితాల మెరుగుదలతో పాటు ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాం.”
నాగార్జునసాగర్ లోనే డిగ్రీ చదవినా..
గుంటూరు, హైదరాబాద్ లో ప్రాథమిక, సెకండరీ విద్యను పూర్తిచేశా. డిగ్రీ నాగార్జునసాగర్ లోని ఏపీఆర్డీసీ(APRDC)లో చదివా. కాబట్టి నల్లగొండ జిల్లాతో నాకు విడదీయన బంధం ఉంది. అప్పుడు నాతో కలిసి డిగ్రీ చదవిని వారంతా ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. జైలర్ గా నాతో పనిచేసిన వారంతా ఎస్పీ(SP) కేడర్ లో ఉన్నారు. గుంటూరు, నల్లగొండ పక్కపక్కనే ఉన్న జిల్లాలు కాబట్టి ఈ జిల్లాలోని నాతో కలిసి చదివిన వారితో సత్సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నల్లగొండలో కూడా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. దీనిలో భాగంగా నాతోపాటు, ఎంఈఓ(MEO)లు సైతం స్కూళ్లు విజిట్ చేసేలా పక్కా ప్రణాళిక రూపొందిస్తా.
నా కలను నా కొడుకు తీర్చే పనిలో ఉన్నడు..
సివిల్ సర్వంట్ కావాలనే నా కోరికను నా కొడుకు తీర్చే పనిలో బిజీగా ఉన్నడు. నాకు ఇద్దరు కొడుకులు. ఒకరు ఎంటెక్(M.Tech) పూర్తిచేశాడు. రెండో కొడుకు బీటెక్(B.Tech) పూర్తిచేసి, ఢిల్లీలో సివిల్ సర్వీస్ కోచింగ్ లో ఉన్నాడు. నా భార్య గృహిణి. మా నాన్నగారు ఫాస్టర్. మా కుటుంబంలో నేనొక్కడినే ప్రభుత్వ ఉద్యోగం సాధించినా. కాబట్టి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు, స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు నల్లగొండ జిల్లాలో అందరి సహకారంతో సక్సెస్ సాధిస్తాననే నమ్మకం ఉంది.