Breaking News: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం..! వైద్యుల నిర్లక్ష్యానికి ఏడు నెలల పసికందు చేయి బలి..!

ఖమ్మం, ఏపీబీ న్యూస్: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న మాటలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా నీరుగారుతున్నాయో చెప్పడానికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. పుట్టిన ఏడు నెలలకే వైద్యుల నిర్లక్ష్యపు దర్యాప్తు, పర్యవేక్షణా లోపం వల్ల ఓ బాలుడు తన కుడి చేతిని పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది.

ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి సూర్యకాంత్ భార్య రేణుక ఏడు నెలల గర్భిణీగా ఉన్న సమయంలోనే కవల పిల్లలకు (Twins) జన్మనిచ్చింది.

మార్చి 4న ఆసుపత్రిలో చేరిక: కవల పిల్లల్లో ఒక బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో, మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు మార్చి 4వ తేదీన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడికి రక్తం తక్కువగా ఉందని (Anemia), తక్షణమే రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు.

వాపు వచ్చినా దాటవేత: బాలుడికి రక్తం ఎక్కించే క్రమంలో చేతికి కాన్యులా (Cannula) ఏర్పాటు చేశారు. అయితే, ఆ కాన్యులా అమర్చిన చోట తీవ్రమైన వాపు వచ్చింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు డ్యూటీలో ఉన్న నర్సులను, డాక్టర్లను బ్రతిమిలాడుతూ చూపించినా.. “అదేం పెద్ద సమస్య కాదు, తగ్గిపోతుంది” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి దాటవేశారు.

ఎన్ని రోజులైనా వాపు తగ్గకపోగా, ఆ పసికందు చేయి క్రమంగా నల్లగా మారిపోయింది. చిన్నారి నొప్పితో విలవిలలాడుతుంటే తట్టుకోలేక తల్లిదండ్రులు మళ్లీ వైద్యులను గట్టిగా నిలదీశారు. దాంతో తప్పు తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది.. తమ వద్ద స్కానింగ్ సౌకర్యం లేదన్నట్టుగా.. “బయట ప్రైవేట్ సెంటర్కు వెళ్లి స్కానింగ్ చేయించుకుని రండి” అని బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పారు.

కన్నవారి ఆందోళనతో బయట చేయించిన స్కానింగ్ రిపోర్టులో షాకింగ్ నిజం బయటపడింది. కాన్యులా తప్పుగా గుచ్చడం వల్ల చేతిలోని రక్తం సరఫరా అయ్యే కణజాలం (Tissues) పూర్తిగా దెబ్బతిన్నదని, చేయి నిర్జీవంగా మారిపోయిందని రిపోర్టులో తేలింది. దీనిపై తల్లిదండ్రులు ఆసుపత్రిలో తీవ్ర ఆందోళనకు దిగడంతో.. ఇక్కడ నయం కాదని, “హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి వెళితే వెంటనే నయం చేస్తారు” అని అబద్ధాలు చెప్పి మార్చి 26వ తేదీన నిలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

బాధిత కుటుంబం మార్చి 26న హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి పసికందును తరలించింది. అక్కడి వైద్యులు బాలుడి చేతిని పరీక్షించి ఘోరమైన నిజాన్ని చెప్పారు. ఖమ్మం ఆసుపత్రిలోనే ఇన్ఫెక్షన్ తీవ్రమై కణజాలం కుళ్ళిపోయిందని, ఆ ఇన్ఫెక్షన్ ఒంటికి పాకకుండా ఉండాలంటే బాలుడి చేతిని మోచేతి వరకు తొలగించడం (Amputation) ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. ఈ మాట విన్న తల్లిదండ్రులు ఆసుపత్రి ఆవరణలోనే గుండెలవిసేలా ఏడ్చారు. చివరికి పసివాడి ప్రాణాలు దక్కించుకోవడం కోసం చేసేదేమీ లేక చేయి తొలగించేందుకు అంగీకరించారు.

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్స్ చేసిన ఘోర తప్పిదం వల్లే తమ కొడుకు జీవితాంతం వికలాంగుడిగా మారాడని, తమకు న్యాయం చేయాలని పుణ్యపురం గ్రామస్థులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాన్యులా పెట్టినప్పుడు వాపు వస్తే కనీసం పట్టించుకోని ఆ డ్యూటీ డాక్టర్లు, నర్సులు అసలు మనుషులేనా అని ‘ఏపీబీ న్యూస్’ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతో వచ్చే పేదలకు ఇలాంటి నరకం చూపిస్తారా? దీనిపై జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు సిబ్బందిని వెంటనే ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, వారిపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ‘ఏపీబీ న్యూస్’ బలంగా డిమాండ్ చేస్తోంది.

Share
Share