- వారానికి ఒకసారి గ్రామాల్లో పర్యటన
- ప్రతి ఆదివారం నల్లగొండ కార్పొరేషన్లో మకాం
- గ్రామాల అభివృద్ధికి ప్రజలంతా కలిసికట్టుగా పని చేయాలని మంత్రి పిలుపు
- మహిళా సంఘాలకు రూ.2.5 కోట్ల చెక్కులు..
- పెద్దసూరారంకు సబ్స్టేషన్, సీసీ రోడ్ల మంజూరు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రా ష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికే కట్టుబడి ఉన్నందున ఆ దిశగా ఇక నుంచి ప్రతి వారం గ్రామాల్లో పర్యటించాలని మంత్రి నిర్ణయించారు. ఈ మేరకు శనివారం తిప్పర్తి మండలంలో పర్యటించిన మంత్రి రచ్చబండ వేధికగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడమేగాక, మహిళను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాలకు భారీగా ఆర్ధిక చేయూత ఇస్తానని తెలిపారు. నల్లగొండ కార్పోరేషన్లో సమస్యలను స్వయంగా పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం నల్లగొండలోనే మకాం పెడ్తానని, ఆ మేరకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
గ్రామాల అభివృద్ధికి సామూహిక కృషి అవసరం
గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయ భేదాలు పక్కనబెట్టి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలని మంత్రి సూచించారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో ఆర్అండ్బీ(R&B) రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రహదారుల విస్తరణ, మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ప్రతి ఆదివారం నల్లగొండలోనే మకాం
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లోని సమస్యలను స్వయంగా పర్యవేక్షించి పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం నల్లగొండలోనే మకాం పెడతానని మంత్రి ప్రకటించారు. అధికారులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

పెద్దసూరారంకు సబ్స్టేషన్ – సెప్టెంబరులో శంకుస్థాపన
పెద్దసూరారం గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. సెప్టెంబరులో శంకుస్థాపన చేసి మూడు నుంచి నాలుగు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందన్నారు.
మహిళా సంఘాలకు రూ.2.5 కోట్ల ఆర్థిక చేయూత
పెద్దసూరారం గ్రామ మహిళా సంఘాలకు ఆగస్టు 15న రూ.2.5 కోట్ల విలువైన చెక్కులు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు చిన్న వ్యాపారాలతో పాటు రైస్ మిల్లులను నిర్వహించే స్థాయికి ఎదగాలని సూచించారు. సంఘాలకు గరిష్టంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాలని మహిళలకు సూచించారు.
చిన్నసూరారం – పెద్దసూరారం మధ్య రైస్ మిల్లు
చిన్నసూరారం, పెద్దసూరారం గ్రామాల మధ్య రైస్ మిల్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అలాగే నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో కూడా రైస్ మిల్లుల ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పెద్దసూరారం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో దశలవారీగా పనులు చేపడతామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మించుకోవాలని మంత్రి కోరారు. తమ ప్రభుత్వం గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 25 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
రచ్చబండ వేదికగా కీలక నిర్ణయాలు
తిప్పర్తి మండల పర్యటనలో రచ్చబండ వేదికగా గ్రామస్థుల సమస్యలను విన్న మంత్రి పలు నిర్ణయాలు ప్రకటించారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికే కట్టుబడి ఉందని, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.