- ఎన్నికల్లో పోటీ పైన స్పష్టత కరువు
- బీసీలకు సీటు త్యాగం.. మహిళలకు అవకాశం..
- ఇప్పుడు ప్రచారం లేకుండానే గెలిపించాలన్న పిలుపు
- జానారెడ్డి 1994 ప్రయోగం గుర్తు చేస్తున్న కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కొత్త చర్చకు తెరలేపారు. వచ్చే ఎన్నికల్లో తాను అసలు ప్రచారం చేయనని, ప్రజలు గెలిపిస్తామని మాట ఇస్తేనే పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీపై ఆయన చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలూ అసౌకర్యానికి గురవుతున్నారు.
పూటకో మాట.. కోమటిరెడ్డి వ్యూహమా? తడబాటా?
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవసరమైతే తన సీటును బీసీలకు త్యాగం చేస్తానని, మహిళను ఎమ్మెల్యేగా నిలబెడతానని కోమటిరెడ్డి ప్రకటించారు. ఆ వ్యాఖ్యలకు బీసీ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది. అనంతరం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరుగుతున్న సమయంలో నల్లగొండ నియోజకవర్గం మహిళలకు లేదా ఎస్సీలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా, నిజంగానే మహిళా రిజర్వేషన్ వస్తే తన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య వంటి మహిళలకు అవకాశాలు రావాలని చెప్పారు. మరోసారి కనగల్ పర్యటనలో మహిళా స్వయం సహాయక సంఘాల్లో చురుకుగా పనిచేసే మహిళనే భవిష్యత్తులో పోటీకి నిలబెడతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ మాట మారింది. తానే పోటీ చేస్తానని, అయితే ప్రచారం మాత్రం చేయనని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయాలని, భారీ మెజార్టీ ఇస్తామని ముందుగా హామీ ఇస్తేనే బరిలో దిగుతానని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రకటనలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని కాంగ్రెస్లోనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు మాత్రం “కోమటిరెడ్డికి తానే చెప్పింది గుర్తుండదు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
సొంత పార్టీలోనూ అసంతృప్తి
కాంగ్రెస్ స్థానిక నాయకత్వం కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలపై బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభివృద్ధి చేసిన నాయకుడిగా త్వరలో గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించిన మంత్రి “ప్రచారం చేయను” అన్న వ్యాఖ్య పార్టీకి రాజకీయంగా మేలు చేస్తుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
జానారెడ్డి ప్రయోగం గుర్తు చేస్తున్న తాజా వ్యాఖ్యలు..
కోమటిరెడ్డి తాజా ప్రకటనలు నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి చేసిన 1994 ప్రయోగాన్ని గుర్తు చేస్తున్నాయి. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన జానారెడ్డి 1983, 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్లో చేరి 1989, 1999లో విజయం సాధించారు. అయితే 1994 ఎన్నికల్లో తాను చేసిన సేవల ఆధారంగా ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా గెలుస్తానని ప్రకటించారు. ఆ ప్రయోగం విఫలమైంది. జానారెడ్డి ఓడిపోగా బడుగుల రామ్మూర్తి యాదవ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సాగర్ రాజకీయాల్లో బీసీ నాయకత్వానికి నాంది పలికారు. ఆ ఎన్నికల తర్వాత సాగర్ రాజకీయ సమీకర ణాలు పూర్తిగా మారిపోయాయి. రాజకీయ పరిశీలకులు ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలను అదే కోణంలో విశ్లేషిస్తున్నారు. ప్రజల తీర్పును ముందుగానే ఖాయమని భావించడం ప్రమాదకరమని వారు సూచిస్తున్నారు.
వైరాగ్య రాజకీయాల సంకేతమా?
తనకు పెద్ద ఆశలు లేవని, క్రియాశీలక రాజకీయాలకు గుడ్బై చెప్పొచ్చని, సొంత ఇల్లు కూడా లేదని, బ్రహ్మణవెల్లంలో మూడు ఎకరాల భూమి మాత్రమే ఉందని, వారసత్వ ఆస్తిని పేదలకు పంచిపెట్టామని కోమటిరెడ్డి చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికై వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేసిన ఆయనకు ఇకపై కొత్తగా పొందాల్సిన పదవులు పెద్దగా లేవన్న భావన ఆయన మాటల్లో కనిపిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బ్రదర్స్ రాజకీయ ఆధిపత్యం ప్రభావమా?
నల్లగొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ప్రభావితం చేసే నాయకులు ఉండటంతో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. మళ్లీ పోటీ చేసి గెలిచినా ఇంతకంటే పెద్ద రాజకీయ స్థానం రాకపోవచ్చనే అంచనాతోనే తన గెలుపు బాధ్యతను ప్రజలపై మోపుతున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.