బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. నో డౌట్: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో జరిపిన ఆఫ్ ద రికార్డ్ చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలంటే తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

సభ బయట షర్టులు విప్పి నిరసనలు తెలపడంపై స్పందిస్తూ.. “సభ పెట్టమంటే పెట్టాం.. మీరు బయట అంగీలు విప్పడానికి కాదు, ప్రజా సమస్యలపై చర్చించడానికి రావాలి. కేసీఆర్, కేటీఆర్ల భాష పరిధి దాటింది. ముఖ్యమంత్రిని, మంత్రులను కుక్కలతో పోలుస్తున్నారు. వీరి భాషా సంస్కృతిపై సభలోనే చర్చ పెట్టాలని స్పీకర్ను కోరతాం” అని వ్యాఖ్యానించారు.

స్పీకర్పై దాడి సహించేది లేదు: “దళిత స్పీకర్పై అంత పచ్చిగా మాట్లాడితే క్షమించకూడదు. నాడేమీ అనకపోయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నన్ను, దళిత యువ ఎమ్మెల్యే సంపత్ను సభ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేశారు. ఈ రోజు స్పీకర్ను అంత మాటన్నా ఊరుకోవాలా?”

కాళేశ్వరంపై బీజేపీ డ్రామాలు: “కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ (CBI) విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.”

ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధం: ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీల అభివృద్ధి, విద్య వంటి ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఏ అంశం లేవనెత్తినా సమాధానం చెప్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, జి.వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు.

స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ భేటీలో స్పీకర్పై ప్రతిపక్షాలు వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్పీకర్కు పూర్తి స్థాయి సంఘీభావం ప్రకటించిన మంత్రివర్గం.. గౌరవ సభాధిపతిని అగౌరవ పరిచిన ఎమ్మెల్సీ తాతా మధుపై చట్టపరంగా, సభా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Share
Share