Breaking News: తుంగతుర్తి కాంగ్రెస్‌లో ముదిరిన మాటల యుద్ధం: ఎమ్మెల్యే మందుల సామేలుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఎమ్మెల్యే మందుల సామేలు తనపై మరియు తన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సామేలు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వినాశకాలే విపరీత బుద్ధి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నాకు తుంగతుర్తితో సంబంధం లేకపోతే.. నా వద్దకు వచ్చి టికెట్ ఇప్పించమని వందసార్లు ఎందుకు వేడుకున్నావు?” అని ఎమ్మెల్యే సామేలును రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. స్వయంగా తానే కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి సామేలుకు తుంగతుర్తి బి-ఫామ్ ఇప్పించానని, తన అనుచరులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి ఆయనను గెలిపించారని గుర్తుచేశారు. “తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ను ఒక తప్పుడు వ్యక్తికి ఇప్పించానని ఇప్పుడు అనిపిస్తోంది. సదరు అభ్యర్థిని నమ్మి ఓటు వేయించినందుకు తుంగతుర్తి ప్రజలకు, నా అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు.

  • టికెట్ కేటాయింపు: అధిష్టానంతో మాట్లాడి సామేలుకు టికెట్ ఇప్పించింది నేనే.
  • కార్యకర్తల రక్షణ: కొత్తగా పార్టీలోకి వచ్చి గెలిచిన నాయకులు పాత కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను.
  • ప్రజలకు క్షమాపణ: తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించినందుకు తుంగతుర్తి ప్రజలకు, కార్యకర్తలకు క్షమాపణలు.
  • నాయకత్వానికి విజ్ఞప్తి: ‘ఆయారాం గాయారాం’లకు భయపడకుండా నిజమైన కాంగ్రెస్ శ్రేణులను కాపాడే బాధ్యత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీలపై ఉందన్నారు.

గతంలో కాంగ్రెస్లో జరిగిన అవమానాలు భరించలేకే తాను బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చిందని, అయితే పార్టీకి తన అవసరం ఉందని గుర్తించి అధిష్టానమే మళ్లీ గౌరవంగా ఆహ్వానించిందని వివరించారు. నిన్న మొన్న కొత్తగా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్న నాయకుల వల్ల సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు నలిగిపోతున్నారని, వారిని కాపాడుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తానని స్పష్టం చేశారు. టికెట్ ఇప్పించి గెలిపించిన వ్యక్తిపైనే దురుసుగా మాట్లాడటం సామేలు విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.

ఇదే సమయంలో, సదరు ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలకు ప్రతిగా పార్టీ నాయకులెవరూ మీడియా సమావేశాలు పెట్టి రచ్చ చేయవద్దని రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Share
Share