- ఎల్ నినో ముప్పుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక
- మునుగోడులో విద్యుత్ రంగానికి ఫస్ట్ ప్రియారిటీ!
- ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో లో-వోల్టేజీపై చర్చలు.
మునుగోడు, ఏపీబీ న్యూస్: రాబోయే రోజుల్లో ఎల్ నినో (El Niño) ప్రభావంతో వర్షాలు తగ్గి వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయం పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడాల్సి వస్తుందని, అందుకే విద్యుత్ సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పనిచేసే బాధ్యత మీది – నిధులు తెచ్చే బాధ్యత నాది
విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “కంటిన్యూగా పని వాతావరణం కల్పించే బాధ్యత నాది, నిధులు తీసుకువచ్చే బాధ్యత నేను చూసుకుంటాను. కానీ బాధ్యతతో పనిచేయడం మీ వంతు. పనిచేసేటట్లయితే ఉండండి, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోండి” అని అధికారులకు నేరుగా హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గాన్ని విద్యుత్ రంగంలో రోల్ మోడల్‌గా మార్చాలని, మొదట మండల కేంద్రాల్లో గృహాలపై ఉన్న ప్రమాదకర లైన్లను షిఫ్ట్ చేసి, ఆ తర్వాత గ్రామాలు, వ్యవసాయ బావుల లైన్లను విడతల వారీగా అభివృద్ధి చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని నిర్దేశించారు.

సమీక్షా సమావేశంలోని ప్రధాన అంశాలు:
ఫస్ట్ ప్రాధాన్యత: కరెంట్ మన జీవనంలో భాగమైంది, విద్యుత్ సరఫరాకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
సిఎండికి ఫోన్: లో-వోల్టేజీ సమస్యలు తీర్చడానికి, మంజూరైన సబ్స్టేషన్ల పనులు వేగవంతం చేయడానికి ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో ఫోన్ లో వివరించారు.
బాధిత ఏఈకి భరోసా: అధికారుల వేధింపుల వల్ల అస్వస్థతకు గురైన మునుగోడు ఏఈ నరేందర్‌ను ఫోన్లో పరామర్శించి, ఉద్యోగ భద్రతపై భరోసా.
సబ్స్టేషన్ల పురోగతి: మునుగోడులో 31 సబ్స్టేషన్లు నడుస్తుండగా, కొత్తగా 6 అందుబాటులోకి వచ్చాయి. మరో 3 ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, 6 టెండర్ దశలో, 3 భూకేటాయింపు దశలో ఉన్నాయి.
ట్రాన్స్‌కో సీఎండీతో సంభాషణ – ఏఈ నరేందర్‌కు భరోసా
బోరుబావుల వినియోగం పెరగడంతో మునుగోడు ప్రాంతంలో లో-వోల్టేజీ సమస్య తీవ్రమవుతోందని, మంజూరైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రాన్స్‌కో సీఎండీ (Transco CMD) కృష్ణ భాస్కర్‌కు ఫోన్ చేసి విన్నవించారు. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మరోవైపు, పని ఒత్తిడి మరియు వేధింపుల వల్ల ఆసుపత్రి పాలైన మునుగోడు ఏఈ నరేందర్‌ను ఎమ్మెల్యే ఫోన్లో పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెబుతూ వెంటనే విధుల్లో చేరాలని, తాను వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఈ సురేష్, నల్గొండ డీఈలు నరసింహ, విద్యాసాగర్, దేవరకొండ డీఈ బాల్య నాయక్, చౌటుప్పల్ డీఈ మల్లికార్జున్‌తో పాటు పలువురు ఏడీఈలు, వివిధ మండలాల ఏఈలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.