- ఇంటి లోన్ తీర్చడం కోసమే మీనాక్షిని కడతేర్చిన భర్త శివాజీ?
- గతంలో భార్యను పిడిగుద్దులతో హింసించిన పాత వీడియోలు బయటపెట్టిన బంధువులు
- 14 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలున్నా మారని భర్త శాడిజం
ఖమ్మం బ్యూరో, ఏపీబీ న్యూస్: డబ్బుపై వ్యామోహంతో బంధాలను, బంధుత్వాలను మర్చిపోతున్న నేటి సమాజంలో మరో దారుణ ఘాతుకం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను భర్తే దారుణంగా కొట్టి చంపినట్లు వస్తున్న ఆరోపణలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
14 ఏళ్ల ప్రేమ బంధం.. లోన్ల కక్కుర్తి:
పోలీసులు మరియు మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. మీనాక్షి, శివాజీ దంపతులు 14 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు స్టేజి సమీపంలోని గోల్ తండాలో వీరు కాపురం ఉంటున్నారు. అయితే, వీరు ఉంటున్న ఇంటిపై దాదాపు 80 లక్షల రూపాయల లోన్ ఉంది.
ఇదే సమయంలో భార్య మీనాక్షి పేరు మీద కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీ ఉంది. భార్య చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులతో తన ఇంటి లోన్ తీరిపోతుందని, మిగిలిన డబ్బుతో జలసా చేయవచ్చని శివాజీ పక్కా స్కెచ్ వేశాడు.
చిత్రవధ చేసి హత్య.. ఆపై ఆత్మహత్య డ్రామా:
బీమా సొమ్ము క్లెయిమ్ చేయడం కోసం శివాజీ గత కొంతకాలంగా భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. శుక్రవారం నాడు మీనాక్షిని దారుణంగా కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు, ఆమె తనే స్వయంగా ఉరివేసుకొని చనిపోయినట్లు నమ్మించేందుకు శవాన్ని ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
భర్త శాడిజం వీడియోలు బయటపెట్టిన బంధువులు:
మీనాక్షి మృతిపై ఆమె పుట్టింటి వారు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం జరిగిన హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. గతంలో భర్త శివాజీ.. మీనాక్షిని కిందపడేసి పిడిగుద్దులతో కిరాతకంగా హింసించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను బంధువులు మీడియాకు చూపించి, అతని శాడిజాన్ని బయటపెట్టారు.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుమలాయపాలెం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ హత్య జరిగిందా? లేక శివాజీ మనసులో మరేదైనా దురుద్దేశం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు శివాజీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
విశ్లేషణ: “డబ్బు కోసం దాంపత్యానికి సమాధి”
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, ఇద్దరు పిల్లలకు తల్లి అనే దయ కూడా లేకుండా కేవలం కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం చంపేయడం మానవత్వానికే మచ్చ. ఇంటి లోన్ల కోసం ప్రాణాలు తీసే స్థాయికి భర్త దిగజారడం భయాందోళన కలిగిస్తోంది. గతంలోనే భార్యపై దాడులు చేసిన వీడియోలు ఉన్నందున, పోలీసులు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని ‘ఏపీబీ న్యూస్’ డిమాండ్ చేస్తోంది.