Breaking News: డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు.. వందల కోట్ల అక్రమాస్తులు గుర్తింపు..

రంగారెడ్డి బ్యూరో, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను అడ్డంపెట్టుకుని సాగుతున్న మరో భారీ ల్యాండ్ స్కామ్ గుట్టును ఏసీబీ అధికారులు రట్టు చేశారు. డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి.

డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ తన అధికార లొసుగులను వాడుకుని ప్రభుత్వ భూములను సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది.

8 ఎకరాల భూమి స్వాహా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాలలో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈయన అత్యంత చాకచక్యంగా తన సొంత మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు.

రియల్ ఎస్టేట్ దందా: అలా ప్రభుత్వ భూమిని రికార్డుల్లో మార్చి, ఆ తర్వాత ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారికి దారాదత్తం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక వందల కోట్ల రూపాయల చేతులు మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

గతంలో అత్యంత కీలకమైన, ల్యాండ్ సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్గా ఉండే శేరిలింగంపల్లి ప్రాంతంలో వంశీ మోహన్ ఆర్డీఓ (RDO)గా పనిచేశారు. ఆ సమయంలోనే ఐటీ కారిడార్ పరిసరాల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రైవేటు వెంచర్లకు అనుకూలంగా మార్చి వందల కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసినట్లు ఏసీబీ రికార్డులు చెప్తున్నాయి. నేటి తనిఖీల్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల కీలు, బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన డిప్యూటీ కలెక్టర్ హోదాలోని అధికారే, తన బంధువుల పేరిట వాటిని రాసి రియల్ మాఫియాకు అమ్మేయడం వ్యవస్థలోని అవినీతికి పరాకాష్ట. ‘ధరణి’ లొసుగులను, రెవెన్యూ రికార్డులను తమకు నచ్చినట్లు మార్చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఇలాంటి ఉన్నతాధికారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, సదరు భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ‘ఏపీబీ న్యూస్’ డిమాండ్ చేస్తోంది.

Share
Share