సీసీటీవీ ఫుటేజ్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా జాగ్రత్త..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఖాతాదారులు ఏటీఎంకు వెళ్లి డబ్బుల కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు, మిషన్ లోపల శబ్దం వస్తుంది కానీ నగదు బయటకు రాదు. టెక్నికల్ సమస్య అనుకుని భక్తులు వెనుదిరగడమే ఈ ముఠాకు వరంగా మారుతోంది. జూబ్లీహిల్స్ వంటి రద్దీ ప్రాంతంలో గత 15 రోజుల్లోనే మూడు వరుస సంఘటనలు జరగడం కలకలం రేపుతోంది.

ఈ ముఠా సభ్యులు ముందుగానే ఏటీఎం కేంద్రాల్లోకి వెళ్లి, నగదు బయటకు వచ్చే స్లాట్ (Shutter) వద్ద ఒక సన్నని ప్లాస్టిక్ కార్డును లేదా స్కేలును అడ్డుగా పెడతారు.

డబ్బులు రావు: ఖాతాదారుడు కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేయగానే, లోపల నగదు కౌంటింగ్ జరుగుతుంది. కానీ బయట ఉన్న ప్లాస్టిక్ అడ్డంకి వల్ల నగదు స్లాట్ వద్దే ఆగిపోతుంది.

ముఠా ఎంట్రీ: డబ్బులు రాలేదని ఖాతాదారుడు ఏటీఎం నుంచి బయటకు వెళ్లగానే, అప్పటివరకు బయట నిలబడిన ముఠా సభ్యుడు వెంటనే లోపలికి వెళ్లి.. ఆ ప్లాస్టిక్ కార్డును తీసి అక్కడ ఆగిపోయిన నగదును తీసుకుని పరారవుతాడు.

వరుసగా మూడు ఏటీఎం కేంద్రాల్లో నగదు మాయం కావడంతో బ్యాంకు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం సెంటర్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నిందితులు చాలా చాకచక్యంగా ఈ పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా అంతరాష్ట్ర ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మీరు ఏటీఎంకు వెళ్లినప్పుడు నగదు రాకుండా, మీ అకౌంట్లో డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే ఏటీఎం సెంటర్ వదిలి వెళ్లకండి.

  1. నగదు వచ్చే స్లాట్ వద్ద ఏదైనా అడ్డంకి ఉందేమో గమనించండి.
  2. వెంటనే సదరు బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్కు ఫిర్యాదు చేయండి.
  3. వీలైతే ఏటీఎం లోపల ఉన్న హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించండి.
Share
Share