APB News Exclusive: గుత్తా లేఖల వెనుక రాజకీయ లెక్కలు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపైన అధికార, ప్రతిపక్ష పార్టీల్లో క్రెడిట్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. ఒకవైపు సీనియర్ మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమదైన శైలిలో ప్రాజెక్టుల పురోగతిని హైలైట్ చేస్తుండగా, మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఎస్ఎల్బీసీ, డిండి, నక్కలగండి వంటి కీలక ప్రాజెక్టులపై వరుస ఫాలో అప్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పెండింగ్ పనులు, టెండర్లు, భూసేకరణ, కాలువ విస్తరణ వంటి అంశాలపై గుత్తా నేరుగా ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా తాను కూడా నీటి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నాననే సందేశం ఇస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాన్నాయి. ప్రధానంగా రైతు ఓటు బ్యాంక్పై ప్రభావం చూపే సాగునీటి అంశాన్ని ఎంచుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో తన ప్రాధాన్యతకు తిరుగులేదనే సంకేతం ఇవ్వడానికే గుత్తా దూకుడు ప్రదర్శిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇటీవల మంత్రి ఉత్తమ్, గుత్తా కలిసి హైదరాబాద్ లో ఇరిగేషన్ ఆఫీసర్ల తో నిర్వహించిన రివ్యూలో కొన్ని సమస్యలకు లైన్ క్లియర్ అయ్యింది.

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కు, ప్రభుత్వానికి గుత్తా రాసిన లేఖల పైన ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రధానంగా ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ వెడల్పు కు ఆమోదం లభించింది. సుమారు రూ.400 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ లైనింగ్ వర్క్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే లైనింగ్ వల్ల సమస్య పరిష్కారం కాదని, కాలువ వెడల్పు చేయాలని దాంతోనే నిర్ధేశించిన ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీళ్లు అందుతాయని అనేక మీటింగ్ లో గుత్తా లేవనెత్తిన సంగతి తెలిసిందే, కానీ టెండర్లలో వెడల్పు ప్రస్తావన తేకుండా కేవలం లైనింగ్ వరకే పరిమితం చేశారు. కాలువ వెడల్పు చేయడానికి అధనంగా మరో రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తదని అధికారులు ప్రతిపాధించారు. అయితే ప్రభుత్వం పైన అదనపు భారం పడకుండా కేటాయించిన రూ.400కోట్లతోనే ఎంతవరకు వీలైతే అంతవరకు కాలువ వెడల్పు చేయాలని గుత్తా సూచించారు. పైగా వెడల్పు చేయడానికి ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సి అవసరం లేదని, గతంలోనే భూములు సేకరించడం జరిగిందనే విషయాన్ని గుత్తా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అంతేగాక శ్రీశైలం సొరంగ మార్గం పూర్తియితే ప్రధాన కాలువలో 4వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటదని, శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినప్పుడు ఇది 6వేల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ సామర్థ్యం కేవలం 3,500 క్యూసెక్కులేనని, కాబట్టి కాలువను ఇరువైపులా వెడల్పు చేయడం ద్వారా ఏఎమ్మార్పీ ఆయకట్టు, ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు నీటిని సమర్ధవంతంగా అందివచ్చని గుత్తా వివరించి చెప్పిన దాంతో మంత్రి ఉత్తమ్ ఆమోదం తెలిపారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యకు వారం రోజుల్లోనే క్లియరెన్స్ లభించనుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న డిండి స్కీం నీటి పంపకాల్లో రెండు జిల్లాల మధ్య గొడవ జరుగుతోంది. 2025 ఆగస్టులో టెండర్లు పిలిచినప్పటికీ ఒప్పందం మేరకు జరగాల్సిన ఎప్ఎస్ఎల్ (పూర్తి సరఫరా స్థాయి నీటి మట్టం) ఇప్పటి వరకు ఖరారు కాలేదు. దాంతో లిఫ్ట్ స్కీం పనులు మొదలు పెట్టలేదు. గత తొమ్మిది నెలల నుంచి పలు ప్రత్యామ్నాయాలు పరిశీలించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీని పైన ప్రతిపక్ష పార్టీలు సైతం ఇటీవల జిల్లాలో ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల మధ్య కాలువ స్థాయి సమానంగా నిర్ణయించాలని గుత్తా సూచించారు. అంతేగాక నార్లాపూర్, ఏదుల పంపింగ్ స్టేషన్లలో అదనపు పంపులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అదనపు నీరు అందించవచ్చని మంత్రి ఉత్తమ్ కు వివరించారు. దీంతో ఉత్తమ్ వారం రోజుల్లో పూర్తి సర్వే చేయించి, పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్మించాల్సిన పోతిరెడ్డి పల్లి బ్యారేజీ పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఏదుల రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసే నీటిని నిల్వ చేసేందుకు డిండి వాగు పైన పోతిరెడ్డిపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాల్సి ఉంది. ఈ బ్యారేజీ నిర్మిస్తేనే డిండి ప్రధాన కాలువలకు నీటిని తరలించే అవకాశం ఉంది. ఏదుల నుంచి డిండి వాగు (దుందుబి నది) వరకు టెండర్లు పూర్తియ్యాయి. కానీ బ్యారేజీ పనులు మొదలు పెట్టలేదు, కాబట్టి బ్యారేజీతోపాటు, భూసేకరణ కూడా చేయాల్సి ఉంది. ప్రస్తుతం బ్యారేజీ నిర్మాణం కోసం సర్వే నడుస్తోంది. వీలైనంత త్వరగా బ్యారేజీ నిర్మించకపోతే డిండి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని చైర్మన్ గుత్తా మంత్రి ఉత్తమ్ కు వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సర్వే కంప్లీట్ చేయాలని, బ్యారేజీ పనులు షురూ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ స్కీంలో భాగంగా తలపెట్టిన పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు పదేళ్లు నిండాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, గత పాలకుల వైఫల్యం వల్ల పెండ్లిపాకల పూర్తిగా పడకేసింది. పదేళ్ల తర్వాత సొరంగ మార్గం పనులు మొదలు అయ్యాయి కాబట్టి టన్నెల్ పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వచ్చేనాటికి పెండ్లిపాకల కూడా పూర్తి చేయాలి. లేదంటే టన్నెల్ స్కీం ఉద్దేశం నెరవరేదు. గత నాలుగేళ్ల నుంచి కాంట్రాక్టర్ పనులు చేయడం ఆపేశాడు. కావున ఆ కాంట్రాక్టు రద్ధు చేసి, బ్యాలెన్స్ పనుల కోసం కొత్త టెండర్లు పిలవాలని, వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని గుత్తా రాసిన లేఖ పైన మంత్రి ఉత్తమ్ స్పందించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Share
Share