Breaking News: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్.. డార్క్ వెబ్‌లో ఖాతాదారుల సమాచారం కలకలం..

ముంబై, ఏపీబీ న్యూస్: భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారీ సైబర్ భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నట్లు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. బ్యాంక్ సర్వర్ వ్యవస్థల్లోకి చొరబడిన హ్యాకర్లు, దాదాపు 1 టెరాబైట్ (1TB) సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసి డార్క్ వెబ్లో (Dark Web) ఉచితంగా అందుబాటులో ఉంచారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

లీకైన ఈ భారీ డేటాలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలకు చెందిన వ్యక్తిగత మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ లబ్ధిదారుల వివరాలు, పేర్లు, ఫోన్ నంబర్లు మరియు లోన్ రికార్డులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ సైబర్ సెక్యూరిటీ ఉదంతాన్ని ‘క్యాష్లెస్ కన్స్యూమర్’ వ్యవస్థాపకుడు, ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ లక్ష్మణన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా వెలుగులోకి తెచ్చారు.

అధికారులకు ఫిర్యాదు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం మరియు సైబర్ దోస్త్ (Cyberdost) అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ లీకైన డేటా ఫోల్డర్ల స్క్రీన్షాట్లను ఆయన షేర్ చేశారు.

నమూనాలు బయటపెట్టిన డార్క్ వెబ్ ఇంటెలిజెన్స్: ‘డార్క్ వెబ్ ఇంటెలిజెన్స్’ అనే మరొక ప్రముఖ ఎక్స్ ఖాతా కూడా హ్యాకర్లు చోరీ చేసిన డేటా శాంపిల్స్ మరియు డౌన్లోడ్ లింక్లను డార్క్ వెబ్లో పెట్టినట్లు ధృవీకరిస్తూ ఆధారాలను బయటపెట్టింది.

డేటా చోరీకి గురైందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ, బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు దేశీయ సైబర్ భద్రతా ఏజెన్సీ సర్ట్-ఇన్ (CERT-In) లేదా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి కూడా ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. ఈ స్థాయి భారీ డేటా లీక్ నిజమే అయితే ఖాతాదారుల ఆర్థిక భద్రత తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని, తక్షణమే బ్యాంకింగ్ యాజమాన్యం స్పందించి విచారణ జరిపించాలని సైబర్ భద్రతా నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు

Share
Share