- ఘనంగా మహీంద్రా యూనివర్సిటీ 5వ వార్షిక కాన్వొకేషన్ వేడుకలు..
- 1,309 మందికి పట్టాలు ప్రదానం,
- ‘బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్’ ప్రారంభం
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: భవిష్యత్తులో ఎదురయ్యే అనూహ్య సవాళ్లు, ఊహించని మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నిరంతరం రూపాంతరం చెందాలని మహీంద్రా యూనివర్సిటీ ఛాన్సలర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పిలుపునిచ్చారు. హైదరాబాదులోని బహదూర్పల్లి వద్ద గల మహీంద్రా యూనివర్సిటీ ఐదో వార్షిక కాన్వొకేషన్ వేడుకలు ఆదివారం (ఆగస్టు 2, 2026) అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్, యూసీ శాన్ డియాగో (యూఎస్ఏ) ఛాన్సలర్ ప్రదీప్ కే ఖోస్లా హాజరయ్యారు.
కాన్వొకేషన్ వేడుకలు – ప్రముఖుల సందేశాలు:
ఆనంద్ మహీంద్రా (ఛాన్సలర్): ఒకప్పుడు జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి అనుకునే సంఘటనలు ఇప్పుడు ప్రతీ ఏటా చోటు చేసుకునే వేగవంతమైన ప్రపంచంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగడానికి ‘మార్పుకు అనుగుణంగా మారే సామర్థ్యం’ మరియు ‘అంతర్గత మనోబలం’ అనే రెండు సూపర్ పవర్స్ అవసరమని పేర్కొన్నారు.
రాజీవ్ బజాజ్ (MD, బజాజ్ ఆటో): సాంకేతికత వ్యాపార నమూనాల కంటే వేగంగా మారుతోంది. ఎంత తెలుసనే దాని కంటే ఎంత త్వరగా నేర్చుకుని అమల్లో పెడతారనేదే పోటీతత్వ ఆధిక్యతను నిర్ణయిస్తుంది. విద్యార్థులు నిరంతర జిజ్ఞాస, నైపుణ్యంలో లోతు పెంచుకోవాలని సూచించారు.
ప్రదీప్ కే ఖోస్లా (ఛాన్సలర్, UCSD): రాబోయే దశాబ్దాల్లో మార్పులకు కేవలం స్పందించే వాటి కంటే, ఆ మార్పులను స్వయంగా తీర్చిదిద్దే సంస్థలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
డాక్టర్ యాజులు మేడురి (వైస్ ఛాన్సలర్): అకాడమిక్ నైపుణ్యం, ఆవిష్కరణలు, పరిశ్రమలతో భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ వేదికపై పోటీపడగల నాయకులను మహీంద్రా యూనివర్సిటీ తీర్చిదిద్దుతోందని తెలిపారు.

1,309 మంది విద్యార్థులకు పట్టాలు – నూతన ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
ఈ వేడుకలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ విభాగాలకు చెందిన మొత్తం 1,309 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వీరిలో 22 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు అందుకోగా, అకాడమిక్గా అసాధారణ ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేసి అభినందించారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానించబడిన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించేందుకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్’ ను బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అధికారికంగా ప్రారంభించారు.