- మోత్కూర్ కేజీబీవీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
- స్టోర్ రూమ్, భోజన నాణ్యత పరిశీలన..
- అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై సమీక్ష.
మోత్కూర్,ఏపీబీ న్యూస్: విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పౌష్టికాహార భోజనం అందేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మోత్కూర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) రెసిడెన్షియల్ బాలికల కళాశాలను ఆయన అకస్మాత్తుగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు.
కళాశాల తనిఖీ – విద్యార్థినులకు సూచనలు:
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కళాశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యాబోధన తీరుపై అధికారులతో సమీక్షించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
భోజన నాణ్యత పరిశీలన: స్టోర్ రూమ్లోని నిల్వలను, విద్యార్థినులకు తయారుచేసి అందిస్తున్న భోజన నాణ్యతను ఆయనే స్వయంగా పరిశీలించారు.
విద్యార్థినులతో ముఖాముఖి: తరగతి గదుల్లో విద్యార్థినులతో నేరుగా మాట్లాడి విద్యాబోధన, భోజనం, వసతులపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
మోత్కూర్ ఎంపీడీఓ కార్యాలయంలో తాగునీటి సరఫరాపై సమీక్ష
అనంతరం మోత్కూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
మోత్కూర్ పెద్ద చెరువు కట్ట మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంపై ఆరా తీశారు. గ్రిడ్ పైప్లైన్ స్వల్పంగా దెబ్బతిన్న నేపథ్యంలో తక్షణమే మరమ్మతులు పూర్తి చేశామని, ప్రస్తుతం తాగునీటి సరఫరా పునరుద్ధరణ జరిగి ఎలాంటి ఇబ్బందీ లేదని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలాజీతో పాటు వివిధ శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.