- మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న మల్లు రవి..
- క్రమశిక్షణ కమిటీ నివేదికతో టీపీసీసీలో తీవ్ర కలకలం
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వైఖరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సిద్ధమైంది. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి కొండా సురేఖను, ప్రణాళికా సంఘం పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించాలని క్రమశిక్షణ కమిటీ స్పష్టమైన సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించింది.
ఇప్పటికే ఈ నివేదికను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్‌లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించారు.
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక – ప్రధానాంశాలు:
కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖ పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని, సొంత కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన కుమార్తె సుస్మితా పటేల్‌ను అదుపు చేయలేకపోతున్నారని కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల తీవ్రతను నివేదికలో పొందుపరిచారు.
మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫారసు: ఆమెపై సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే పార్టీ ప్రతిష్టకే ముప్పు వాటిల్లుతుందని, అందువల్ల క్యాబినెట్ నుంచి తప్పించాలని సిఫారసు చేశారు.
చిన్నారెడ్డి విషయంలో ఆగ్రహం: స్థానిక ఎమ్మేల్యేలు మరియు పార్టీ అంతర్గత విషయాలపై విరుద్ధ వ్యాఖ్యలు చేసినందున చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.
సీఎంతో మల్లు రవి భేటీ: మరికాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. చర్యలు తీసుకోవడానికి గల బలమైన కారణాలను, నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోయే తుది నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.