- “సొంత ఇల్లు లేదంటున్న కోమటిరెడ్డికి కలెక్టర్ ఓ డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలి”
- డబుల్ బెడ్ రూమ్ల దోపిడీ, అక్రమాలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: “నల్లగొండలో ప్రస్తుతం రాక్షస రాజ్యం, కమిషన్ల రాజ్యం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ చూసుకునే ఈ అరాచకాలు సాగుతున్నాయి” అని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిపిఎం నాయకులు, కార్యాలయంపై పోలీసులు దౌర్జన్యం చేసి అరెస్ట్లు చేయడాన్ని ఆయన అమానుష చర్యగా అభివర్ణించారు.
నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాల్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అభివృద్ధి పనుల నిర్లక్ష్యంపై ప్రభుత్వంపై, పోలీసుల వైఖరిపై సంచలన ఆరోపణలు గుప్పించారు.
కంచర్ల భూపాల్ రెడ్డి ప్రెస్ మీట్:
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దందా: కేసీఆర్ హయాంలో ప్రజా సమక్షంలో డ్రా తీసి 546 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, రోడ్డు బాధితులకు ఇళ్లను కేటాయించామని చెప్పిన ఆయన.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఒక్కో ఇంటికి రూ.3 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఆరోపించారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకపోతే తమ ప్రభుత్వం వచ్చాక రీ-వెరిఫికేషన్ చేసి డ్రాలు తీస్తామని, లంచాలు ఇచ్చిన వారు వెంటనే వసూలు చేసుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళాలు వేసే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
సీపీఎం ఆఫీస్పై దాడి ఖండన: ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం ఆఫీస్పై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని, సంబంధిత ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ విషయమై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి విధులు మరిచి మంత్రికి జీహుజూర్ అంటున్నారని మండిపడ్డారు.
భూకబ్జాలు & అమృత్ స్కీమ్ నిధుల దుర్వినియోగం: పట్టణంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని, అమృత్ స్కీమ్ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వెంచర్లలో సీసీ రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ వెంచర్లపై విజిల్స్ విచారణ వేయిస్తామన్నారు.
కెసిఆర్ హయాం నాటి అభివృద్ధి నిర్లక్ష్యం: ఐటీ టవర్, ఎన్జీ కాలేజ్ నిర్మాణం, పానగల్ ఎల్లమ్మ గుడి రోడ్డు పనులు, ఔటర్ రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్, కళాభారతి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి కోమటిరెడ్డికి సవాల్ విసిరారు.
గెస్ట్ హౌస్ ఆక్రమణ & ఏసీల విక్రయం: ప్రతిష్టాత్మకమైన ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను తన విలాసవంతమైన జీవితానికి ‘ఇందిరా భవన్’గా మార్చుకున్నారని, చివరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తను స్వంత నిధులతో వేయించిన ఏసీలను కూడా అమ్ముకున్నారని సంచలన ఆరోపణ చేశారు.
జర్నలిస్టుల ఇళ్లకు అండగా బీఆర్ఎస్: జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ అండగా ఉండి ఉద్యమిస్తుందని ప్రకటించారు.
కొసమెరుపు:
“మాటిమాటికీ తనకు స్వంత ఇల్లు కూడా లేదని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డికి.. కలెక్టర్ గారు వెంటనే స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఒక ఇంటిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్, దేప వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.