Breaking News: గంజాయి బ్యాచ్‌తో ఎస్సై, కానిస్టేబుళ్ల ఖాకీ దోస్తాన్.. ఈగల్ టీమ్‌పైకి కుక్కలు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గ్రేటర్ హైదరాబాద్లోని బాలానగర్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయాలు సాగిస్తున్న గంజాయి బ్యాచ్తో స్థానిక పోలీసులే చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఘోరమైన దారుణం వెలుగు చూసింది. గంజాయి బ్యాచ్ నివాసంపై దాడి చేసేందుకు వచ్చిన ఈగల్ టీం (Eagle Team) పోలీసులపైకి నిందితులు కుక్కలను ఉసిగొల్పి, స్క్రూ డ్రైవర్లతో పొడిచి హత్యాయత్నానికి ఒడిగట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన ఈగల్ టీమ్ అధికారులకు.. స్థానిక ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రమేయం బయటపడటంతో ఖాకీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

ఏపీ నుంచి గంజాయి స్మగ్లింగ్: ఆంధ్రప్రదేశ్ – పాడేరు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అనే ముగ్గురు అన్నదమ్ములు బాలానగర్లోని వినాయక్నగర్ శ్మశానవాటిక సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని 2022 నుంచి గంజాయి దందా సాగిస్తున్నారు. ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి చిన్న చిన్న పొట్లాలుగా మార్చి వాట్సాప్ ద్వారా విక్రయిస్తున్నారు.

మిడ్నైట్ రైడ్పై కుక్కలతో దాడి: బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిందితులు ఇంటికి వచ్చినట్లు పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు వారి ఇంటిని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకోవడానికి నిందితులు పోలీసుల మీదకు పెంచుకుంటున్న కుక్కలను ఉసిగొల్పి, స్క్రూ డ్రైవర్తో పొడిచి దాడి చేశారు.

పోలీసుల ఖాకీ మాఫియా: దాడి చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. స్థానిక బాలానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ ఎస్సై, కానిస్టేబుళ్లు నిందితులతో రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారని తేలింది.

రైడ్కు కొద్ది గంటల ముందే పార్టీలు: ఈగల్ టీం దాడి చేయడానికి కొద్ది గంటల ముందే (మంగళవారం) సదరు ఎస్సై, కానిస్టేబుళ్లు నిందితుల ఇంట్లోనే మద్యం పార్టీ చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ ఎస్సై రెండు రోజుల క్రితమే బాలానగర్ పీఎస్ నుంచి బదిలీ అయ్యారు.

పోలీసుల పార్టీలకు క్యాటరింగ్ సరఫరా: నిందితులు సదరు పోలీసుల ప్రైవేట్ పార్టీలకు మద్యం, ఖరీదైన క్యాటరింగ్ సరఫరా చేసేవారని.. దానికి ప్రతిఫలంగా ఉన్నతాధికారులు లేదా ఇతర బృందాలు తనిఖీలకు వస్తే ముందే సమాచారం అందించి రక్షించేవారని విచారణలో వెల్లడైంది.

నిందితుల ఫోన్లను సీజ్ చేసి పరిశీలించగా ఏకంగా 203 మంది గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిలో 100 మందిని పోలీసులు డ్రగ్ టెస్టులు చేయగా, అందులో 72 మందికి పాజిటివ్గా తేలింది. గంజాయి మూలాలను మట్టుబెట్టాల్సిన పోలీసులే మాఫియాతో చేతులు కలపడంపై నగర పోలీస్ కమిషనరేట్ తీవ్రంగా పరిగణించింది. సంబంధిత ఎస్సై, కానిస్టేబుళ్లపై శాఖాపరమైన తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Share
Share