- మూడో తరగతి విద్యార్థిని మృతి
- ఆగస్టు 15 వేడుకల కోసం సిద్ధమవుతుండగా ప్రమాదం..
- మరో 5 మంది విద్యార్థులకు గాయాలు, ఒకరికి కాలు ఫ్రాక్చర్
భువనగిరి, ప్రతినిధి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న చిన్నారులపై భారీ వేప చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఓ ఎనిమిదేళ్ల విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘోర ప్రమాదంలో మరో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాగాయత్ స్కూల్లో ప్రమాదం: భువనగిరి పట్టణంలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఆగస్టు 15 వేడుకల వేళ ఘోరం: రేపు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉండటంతో విద్యార్థులు పాఠశాల గ్రౌండ్లో ఆటలు ఆడుకుంటూ, రిహార్సల్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రాంగణంలోని ఓ పాత వేప చెట్టు కొమ్మ ఒక్కసారిగా చిన్నారులపై విరిగిపడింది.
విద్యార్థిని మృతి: ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడో తరగతి విద్యార్థిని హలీమా (8) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మరో 8 మందికి గాయాలు: కొమ్మ కింద చిక్కుకుని మొత్తం 5 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఓ విద్యార్థి కాలు విరిగినట్లు (ఫ్రాక్చర్) పోలీసులు వెల్లడించారు.
ప్రమాదాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆడుతు పాడుతూ కళ్లముందే తిరిగిన పాప హలీమా మృతి చెందడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పాఠశాల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత, శోకసంద్రం అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.