APB News Exclusive: నల్లగొండ ఐకాన్‌ ఆసుపత్రిలో ప్రాణం ఖరీదు కోట్లు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలోని ఐకాన్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మూడేళ్లలో 191 మంది రోగులు వివిధ కారణాలతో మరణించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణలో తేలడంతో ఆసుపత్రి వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్పొరేట్ వైద్య సేవల ముసుగులో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని, రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు లిఖిత పూర్వక ఫిర్యాదులే గాక, ఫోన్ల ద్వారా కూడా ఆసుపత్రి బాగోతం గురించి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ రాహుల్ రెండు రోజుల క్రితం ఐకాన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన విచారణలో రికార్డులను పరిశీలించడమేగాక, ప్రత్యక్షంగా పేషెంట్ల వాగ్మూలం కూడా తీసుకున్నారు. అయితే డీఎంహెచ్ఓ(DMHO)కు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఆ ఆసుపత్రి నిర్వహణలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. మరణించిన రోగుల చికిత్స రికార్డులు, మందుల బిల్లులు, ఐసీయూ ఛార్జీలు, ప్రత్యేక వైద్య సేవల పేరుతో వసూలు చేసిన మొత్తాలపై స్వతంత్ర విచారణ జరిపితే అసలు నిజాలు బయటపడతాయని వారు అంటున్నారు. నల్లగొండలో పేరొందిన ఇద్దరు మహిళా డాక్టర్ల వారసులుగా వైద్య వృత్తిలోకి వచ్చిన ఈ ఆసుపత్రి బృందం కనీసం నైతిక విలువలు కూడా పాటించడం లేదని, రోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని ఫిర్యాదుల్లో ఆరోపించారు.

ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన రోగులను వారం రోజుల నుంచి రెండు, మూడు నెలల వరకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని పలువురు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోగి పరిస్థితిని రోజుకోలా చెప్పి బంధువులను ఆందోళనకు గురిచేస్తూ చికిత్స కొనసాగిస్తున్నారని వారు పేర్కొన్నారు. నల్లగొండలోని గొల్లగూడకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి 16న విషం తాగిన ఘటనలో ఆసుపత్రిలో చేరగా మార్చి 31 వరకు చికిత్స అందించినట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు. దీనికిగాను రూ. 7.20 లక్షల బిల్లు వేశారు. అందులో 275 ఇంజక్షన్లు చూపించి సుమారు రూ.1.20 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. వాడినట్లు చూపిన ఇంజక్షన్ల వినియోగ రికార్డులు స్పష్టంగా లేవని, ఒక్క రోగికి 15 రోజుల్లో అంత భారీ సంఖ్యలో ఇంజక్షన్లు వేయడం సాధ్యమేనా అనే సందేహాన్ని వారు వ్యక్తం చేశారు. డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు, మందుల బిల్లులపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఫిర్యాదులో కోరారు.

ఆసుపత్రి మేనేజ్మెంట్ కు సన్నిహితంగా ఉన్న ఒక జర్నలిస్టు కుటుంబానికి చెందిన ఓ వృద్ధ రోగికి రూ. 22.45 లక్షల బిల్లు వేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పొలం వద్ద కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చగా తలకు గాయం అయ్యిందని శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బిల్లులో సుమారు ఆసుపత్రి ఖర్చులు రూ. 13 లక్షలు, ఫార్మసీ రూ. 7.15 లక్షలు, ల్యాబ్ పరీక్షలు రూ. 2 లక్షలు చూపించారని తెలిపారు. రోగిని దాదాపు 25 రోజులు ఐసీయూ లో ఉంచారని, చూసేందుకు రోజుకు కేవలం కొద్ది నిమిషాలే అనుమతించారని ఆరోపించారు. ఇంత ఖర్చు భరించలేమని, రోగిని ఇంటికి తీసుకెళ్తామని కోరినా వైద్యులు అంగీకరించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు అన్ని బిల్లులు చెల్లించినప్పటికీ రోగి ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదని, ఇప్పటికీ పేషెంట్ కండీషన్ అట్లాగే ఉందని కుటుంబ సభ్యులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం అరెకరం భూమి అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు.

ఇలాంటి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని స్థానిక వర్గాల్లో చర్చ జరుగుతోందని సమాచారం. నల్లగొండలోని ఒక డాక్టర్ దగ్గర బంధువులకే భారీ బిల్లులు విధించిన ఘటనలు ఉన్నాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లలో మరణించిన 191 మంది రోగుల కేసులపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసి ప్రతి కేసు వైద్య రికార్డులను పరిశీలించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. చికిత్స విధానం, మందుల వినియోగం, ఐసీయూ నిర్వహణ, బిల్లుల నిర్మాణం వంటి అంశాలపై నిపుణుల కమిటీ విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

కొంతమంది వైద్య వర్గాలు ఆసుపత్రిలో వినియోగిస్తున్న మందుల నాణ్యత, వాటిపై ఉన్న మార్జిన్ శాతం వంటి అంశాలపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. గ్రామాలు, పట్టణాల్లో మెడికల్ క్యాంపుల పేరుతో ప్రజలను ఆసుపత్రికి రప్పించి తరువాత భారీ బిల్లులు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు, సామాజిక సంఘాలు ఐకాన్ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాయి. అవసరమైతే ఆరోగ్య శాఖ, విజిలెన్స్, ఔషధ నియంత్రణ, ఆదాయపన్ను శాఖలతో కూడిన సంయుక్త విచారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెలికితీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐకాన్ మేనేజ్మెంట్ ఎవరికీ భయపడదని, వారి వెనక బలైమన రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. కనీస నైతిక విలువలు కూడా పాటించరని ఆరోపిస్తున్నారు. పేషెంట్ల తరపున ఫీజులు తగ్గించని ప్రజాప్రతినిధులు ఎవరైనా సిఫార్సు చేసినా పట్టించుకోరని, నామమాత్రంగా తగ్గించి గొప్పులు చెప్పుకుంటున్నారని పేషెంట్ల బందువులు తెలిపారు. అధిక ఫీజులతో కోట్ల కూడపెట్టిన ఐకాన్ మేనేజ్మెంట్ అనతి కాలంలో హైదరాబాద్, నల్లగొండ, తదితర ప్రాంతాల్లో కోట్లు పలికే ఆస్తులు కొనుగోలు చేశారని తెలిసింది. ఒక్క నల్లగొండలోనే నార్కట్ పల్లి – అద్దంకి హైవే పైన ఓ ప్రధాన పత్రిక ఆఫీసుకు సమీపంలో ఎకరం రూ.2కోట్లు చొప్పున 5 ఎకరాలు కొనుగోలు చేసినట్టు డాక్టర్ల సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో భారీ ఆస్తులు కూడబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారని, వాటి మూలాలను కూడా అధికారులు పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.

Share
Share