మునుగోడు ఆసుపత్రుల ఆధునికీకరణపై మంత్రి దామోదరతో రాజగోపాల్ భేటీ

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, ఆసుపత్రుల ఆధునీకరణే ధ్యేయంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రమిస్తున్నారు. మంగళవారం సచివాలయంలోని ఆయన చాంబర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, మౌలిక వసతులు, అధునాతన పరికరాలు, సిబ్బంది నియామకంపై సమగ్రంగా చర్చించారు.

మునుగోడు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలపై మంత్రి దామోదర రాజనర్సింహ అత్యంత సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలోని హాస్పిటళ్ల పరిస్థితి, అవసరాలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

చౌటుప్పల్లో ట్రామా కేర్ సెంటర్: జాతీయ రహదారి 65 (NH 65)పై ప్రమాదాలు జరిగినప్పుడు ‘గోల్డెన్ అవర్’లో క్షతగాత్రులను హైదరాబాద్ తరలించే లోపే మరణిస్తున్నారని, వెంటనే చౌటుప్పల్లో ట్రామా కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

100 పడకల ఏరియా హాస్పిటల్స్: చౌటుప్పల్ 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను ఈ నెల చివరికల్లా పూర్తి చేసి, సెప్టెంబర్లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే చండూరు రెవెన్యూ కేంద్రంలో కొత్తగా 100 పడకల ఏరియా ఆసుపత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పీహెచ్సీ, సీహెచ్సీల అప్గ్రేడేషన్: మునుగోడు, నాంపల్లి పీహెచ్సీలను (PHC) 30 పడకల ఆసుపత్రులుగా, మర్రిగూడ సీహెచ్సీని (CHC) 30 నుంచి 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం, గట్టుప్పల్ పీహెచ్సీలో సిబ్బంది, సాంకేతిక పరికరాలు సమకూర్చడంపై చర్చించారు.

పోస్టుమార్టం రూమ్లు & బడ్జెట్ పెంపు: గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ధరలు, సాంకేతికతకు అనుగుణంగా సబ్ సెంటర్లు, పీహెచ్సీల నిర్వహణ బడ్జెట్ను పెంచాలని మరియు ఆసుపత్రులలో పోస్టుమార్టం ఎగ్జామిన్ రూమ్లను ఏర్పాటు చేయాలని కోరారు.

మునుగోడులో వైద్య సేవలను సమీక్షించిన అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని హాస్పిటళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, నల్గొండ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్, డిసిహెచ్ మాతృ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్ఓ మనోహర్, డిసిహెచ్ సూర్యశ్రీ మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Share
Share