- గ్రామీణ విద్యార్థులు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
- ‘వుయ్ హబ్’ నూతన జాతీయ స్థాయి శిక్షణ పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని యువత మరియు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారి వ్యాపార ఆలోచనలకు (Business Ideas) గ్లోబల్ వేదికను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇన్క్యుబేటర్ ‘వుయ్ హబ్’ (WE Hub) నడుం బిగించిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల పరిధిలోని గ్రామీణ విద్యార్థులను, మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా (Entrepreneurs) మార్చడమే లక్ష్యంగా సరికొత్త జాతీయ స్థాయి ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ‘వుయ్ హబ్’ ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సంబంధిత బ్రోచర్ మరియు పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
నూతన శిక్షణ కార్యక్రమాల వివరాలు:
గ్రాస్రూట్స్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (Grassroots Youth Innovation Program):
- లక్ష్యం: యువతను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం.
- అర్హత: 17 నుండి 23 సంవత్సరాల వయస్సు కలిగిన అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- శిక్షణ విశేషాలు: జిల్లా స్థాయిలో హ్యాకథాన్లు, ఐడియాషన్ సెషన్స్ నిర్వహిస్తారు. ఎంపికైన ఐడియాలకు 12 వారాల పాటు ఇంటర్న్‌షిప్, ప్రొటోటైప్ తయారీ, పేటెంటింగ్ సపోర్ట్, సాఫ్ట్ స్కిల్స్‌పై మెరుగైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం ఇస్తారు.
సోషల్ ఇంపాక్ట్ & ఆంత్రప్రెన్యూర్‌షిప్ (SIE) ప్రోగ్రామ్:
- లక్ష్యం: టైర్-2, టైర్-3 ప్రాంతాల్లోని మహిళలు, వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం.
- ప్రాధాన్య రంగాలు: ఎఫ్ఎంసీజీ (FMCG), ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత (Handlooms) రంగాలలో వ్యాపారం చేసే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
- మద్దతు: 3 నెలల పాటు డిజిటల్ నెట్వర్కింగ్, బిజినెస్ సూత్రాలపై శిక్షణతో పాటు తదుపరి 6 నెలల పాటు ఫండింగ్ (ఫైనాన్షియల్ సపోర్ట్), లీగల్ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో పూర్తి సాయం అందిస్తారు.
మహిళా ప్రామాణికతా కేంద్రాల ఏర్పాటు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక మహిళా వ్యాపారులకు సేవలందించేందుకు ప్రత్యేకంగా మహిళా ప్రామాణికతా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన యువత మరియు మహిళలు పూర్తి వివరాలు మరియు దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ www.wehub.telangana.gov.in ను సందర్శించాలని కోరారు.
ఈ సమీక్షా సమావేశం మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిఆర్డిఓ పీడీ సన్యాసయ్య, డిఈఓ అశోక్, మెప్మా పీడీ శ్రీనివాస్, డిడబ్ల్యూఓ నరసింహారావు, ‘వుయ్ హబ్’ సీఈఓ సీతా పళ్ళచుని, అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్, ఊహ సజ్జ మరియు ఇతర బృంద సభ్యులు పాల్గొన్నారు.