- కాంగ్రెస్ కంచుకోటకు ముఖ్యమంత్రి పదవి ఇంకా దూరమేనా?
- 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి
- ఒకప్పుడు సీఎం పదవి, పీసీసీ పీఠం కోసం పోటీపడ్డ అగ్రనేతలు
- దక్షిణ తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించిన జిల్లా
- మంత్రి పదవులతోనే రాజకీయ జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి
- రావి నారాయణరెడ్డి నుంచి జానారెడ్డి వరకు సీఎం పదవి వస్తుందని ఆశించిన నేతలే
- రేవంత్ ప్రకటనతో నల్లగొండ నేతల సీఎం ఆశలపై నీళ్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరింత మసకబారినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న ఈ జిల్లా నుంచి ఎప్పుడో ఒక రోజు సీఎం వస్తారన్న ఆశలు దశాబ్దాలుగా వినిపిస్తున్నాయి. అయితే “2034 వరకు నేనే ముఖ్యమంత్రి” అని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో నల్లగొండకు మంత్రి పదవులు తప్ప సీఎం పీఠం అందడం కష్టమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్వాతంత్ర్య పోరాటం, సత్యాగ్రహం, రైతాంగ ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన నల్లగొండ రాజకీయంగా రాష్ట్రానికి ఎంతో మంది నాయకులను ఇచ్చినా ముఖ్యమంత్రిని మాత్రం ఇవ్వలేకపోయింది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వీరసేనాని రావి నారాయణ రెడ్డి నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరకు సీఎం ఆశలు ఎన్నిసార్లు రెక్కలు తొడిగినా చివరి క్షణంలోనే కూలిపోయాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
రావి నుంచి జానా వరకు.. అందని సీఎం పీఠం
1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి నాయకత్వంలోని పీడీఎఫ్(PDF) తెలంగాణలో భారీ విజయాలు సాధించింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధికారానికి దూరమైంది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు మెజార్టీ సాధించి ఉంటే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రావి నారాయణరెడ్డి ఉండేవారని రాజకీయ చరిత్రకారులు ఇప్పటికీ చెబుతుంటారు. 1978లో కాంగ్రెస్‌లో సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి పేరు సీఎం రేసులో వినిపించినా చివరకు నిరాశే ఎదురైంది. తర్వాత దశాబ్దాల పాటు జానారెడ్డి పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చర్చల్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే జానాకే అవకాశం వస్తదని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. కానీ వరుస ఎన్నికల పరాజయాలు జానారెడ్డిని రాజకీయాల నుంచి దూరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరమైనప్పటికీ ఎమ్మెల్సీగా ఎన్నికై జానారెడ్డి సీఎం అవుతారని భావించారు. కానీ వయసు పైపడటం తో క్రియాశీలక రాజకీయాలకే ఆయన గుడ్ బై చెప్పారు.
ఉత్తమ్‌పై పోరు.. కోమటిరెడ్డి బ్రదర్స్ లెక్కలు
జిల్లా కాంగ్రెస్ అగ్రనేతల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే సీఎం పదవి చేజారిపోయిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నేతల మధ్య సఖ్యత ఉన్నట్లయితే 2023లో జానారెడ్డి సీఎం అయ్యేవారని చెప్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక దశలో సీఎం రేసులో ఉన్నారని భావించారు. కానీ పీసీసీ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని జిల్లాలోనే తీవ్ర రాజకీయ పోరు మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వర్గాలు ఉత్తమ్‌ను పీసీసీ నుంచి తప్పించాలని బహిరంగంగానే ప్రయత్నించారు. ఉత్తమ్‌ను దింపగలిగితే పీసీసీ తమకే దక్కి, ఆ తర్వాత సీఎం అవకాశాలు కూడా వస్తాయని కోమటిరెడ్డి బ్రదర్స్ లెక్కలు వేసుకున్నారని అప్పటి కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే అధిష్టానం ఆ సమీకరణాలన్నింటినీ తారుమారు చేసింది. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ దిశ పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. ఎవరికి వారు తామే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులమని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అధిష్టానం భావించి, ఆయనకే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది.
రేవంత్ ప్రకటనతో వేడెక్కిన చర్చ..
ఇప్పుడు రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడంతో నల్లగొండ నేతల సీఎం కలలు చెల్లా చెదురై నట్లయ్యాయి. దక్షిణ తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలిపించే జిల్లాగా పేరు ఉన్నా, ము ఖ్యమంత్రి పదవి మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా అన్న చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని, మంత్రులను అధిష్టానమే నిర్ణయించే సంప్రదాయం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం తానే రెండోసారి సీఎం అవుతానని ఎక్కడా ప్రకటించుకోలేదు. అధిష్టానం నిర్ణయాన్నే శిరోధార్యంగా భావించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తానే మరో దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశమైంది. ఈ ప్రకటనపై జిల్లా అగ్రనేతల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తనకు ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆశలు లేవని, రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎంగానే కొనసాగుతారని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఆయన స్వయంగా సీఎం రేసు నుంచి తప్పుకున్నట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలోనూ సీఎం ఆశలు సన్నగిల్లినట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి వెంకటరెడ్డి, ఉత్తమ్ ఇద్దరి వయసూ 70 ఏళ్లకు చేరుకుంటుంది. దీంతో భవిష్యత్ నాయకత్వంపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటంతో ఇప్పుడే సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టమైన అంచనా వేయడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నదే నల్లగొండ నేతల భవిష్యత్‌ను నిర్ణయించనుందని వారు చెబుతున్నారు.