వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు: రైతులకు కలెక్టర్ పిలుపు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎల్నినో (El Niño) ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, జిల్లాలో వరి సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా ప్రోత్సహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయం నుంచి వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో పాటు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికీ కొంతమంది రైతులు వర్షాలు కురుస్తాయన్న ఆశతో వరి సాగు చేసేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో కూడా వరికి అవసరమయ్యే స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవచ్చని స్పష్టం చేశారు. వరినారు పోసుకున్న రైతులు కూడా నష్టపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా ఇతర ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలకు మారేలా అధికారులు గ్రామగ్రామానికి వెళ్లి చైతన్యపరచాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు: వరి స్థానంలో తక్కువ నీటితో పండే కూరగాయలు, కంది, మినుములు, జొన్న వంటి పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలి.

రైతుల గుర్తింపు: ఇప్పటివరకు పంటలు వేయని రైతులను గ్రామాల వారీగా సర్వే చేసి గుర్తించాలి. నేరుగా వారి వద్దకు వెళ్లి ఇతర పంటల వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలను వివరించాలి.

యూనిఫామ్స్ స్టిచ్చింగ్ వేగవంతం: జిల్లాలోని 17 మండలాల్లో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కోసం క్లాత్ చేరింది. క్లాత్ వచ్చిన ప్రాంతాల్లో వెంటనే స్టిచ్చింగ్ పనులను పూర్తి చేయాలి.

ఆగస్టు 10 డెడ్లైన్: ఆగస్టు 10వ తేదీలోగా జిల్లాలోని విద్యార్థులందరికీ యూనిఫామ్స్ అందజేయాలని, పాఠశాలల్లో ఆల్టరేషన్ కోసం ప్రత్యేకంగా టైలర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ & జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీఈఓ సుశిందర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి శేఖర్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share
Share