- మునుగోడు ఉప ఎన్నికల నుంచి మొదలైన వార్
- బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన
- అద్దంకి దయాకర్, పున్నా కైలాష్ నేత, చెరుకు సుధాకర్
- మళ్లీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లక్ష్యంగా దుర్భాషలాడిన ఎమ్మెల్యే మందుల సామేల్
- ఎస్సీ, బీసీలను ఎమ్మెల్యేలుగా గెలిపించిన బ్రదర్స్ పైన టార్గెట్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ చుట్టూ మళ్లీ రాజకీయ వేడి పెరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనా అద్దంకి దయాకర్, పున్నా కైలాష్ నేత, చెరుకు సుధాకర్ వంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఎన్నికల బహిరంగ సభలో నోటికొచ్చినట్టు తిట్టడం కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాగానే పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలోకి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ముందుకొచ్చి చర్చలు జరపడంతో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ నిర్ణయం భువనగిరి పార్లమెంట్ పరిధిలో రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయానికి కోమటిరెడ్డి బ్రదర్స్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. అంతేగాక చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించడంలో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కిరణ్ ఎంపీగా గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామనే హామీ కూడా ఇవ్వడం జరిగింది.
అధిష్టానం వద్ద బ్రదర్స్ దే హవా..
ఉమ్మడి జిల్లాలో బ్రదర్స్ ప్రభావం నల్లగొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో బలంగా ఉంది. బ్రదర్స్ ఇద్దరు భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా గెలవడమేగాక, ఆయా నియోజకవర్గాల్లో బ్రదర్స్ సిఫార్సు మేరకే అధిష్టానం ఎమ్మెల్యే టికెట్లు ఇస్తోంది. ముఖ్యంగా ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో బ్రద ర్స్ హావానే నడుస్తుంది. 2018 లో చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వడం పై అధిష్టానం వెనుకంజ వేయగా, చిరుమర్తికి అవకాశం ఇస్తేనే తాను కూడా బరిలో ఉంటానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. చివరకు లింగయ్యకు టికెట్ దక్కగా, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని బ్రదర్స్ మద్దతే కలిసొచ్చిందనే అభిప్రాయం అప్పట్లో బలంగా వినిపించింది. 2023 ఎన్నికల్లోనూ నకిరేకల్ అభ్యర్థిత్వం చుట్టూ అదే ప్రభావం కనిపించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొండేటి మల్లయ్యకు దక్కాల్సిన టికెట్‌ను మార్చి వీరేశం ఉంటేనే పార్టీ గెలుస్తుందని అధిష్టానాన్ని ఒప్పించి పార్టీలోకి రప్పించడంలో బ్రదర్స్ కీలక పాత్ర పోషించారని చర్చ జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య టికెట్ విషయంలో కూడా హైకమాండ్‌ను ఒప్పించింది కోమ టిరెడ్డి బ్రదర్సే అని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తుంగతుర్తిలో అయితే అద్దంకి దయాకర్‌ను పక్కనబెట్టి సామేల్‌కు టికెట్ దక్కేలా రాజగోపాల్ రెడ్డి చురుకుగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టికెట్ కోల్పోయిన దయాకర్‌ను ఎమ్మెల్సీగా చేస్తామని వెంకటరెడ్డి ఎన్నికల సభలో ఇచ్చిన హామీని తర్వాత నెరవేర్చడం ద్వారా బ్రదర్స్ ప్రభావాన్ని మరోసారి నిరూపించుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి.
బ్రదర్స్ ను దెబ్బతీయడమే లక్ష్యమా…?
ఇప్పుడు అదే ప్రభావం కొందరికి అసహనంగా మారిందా అన్న ప్రశ్న కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఒకే సామాజిక వర్గం ఆధిపత్యం పెరుగుతుందనే భావనతో పార్టీ అంతర్గతంగా మరో వర్గం కదులుతోందనే చర్చ నడుస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో జానారెడ్డి ప్రభావం కొనసాగుతుండగా, భువనగిరి పార్లమెంట్ పరిధితో పాటు నల్లగొండ, మునుగోడులో బ్రదర్స్ ఆధిపత్యం బలంగా ఉందని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రూపు రాజకీయాలను రెచ్చగొట్టి బ్రదర్స్‌కు ప్రత్యామ్నయ వర్గాన్ని తయారు చేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు కాంగ్రె స్లోనే వినిపిస్తున్నాయి. నకిరేకల్, తుంగతుర్తి, మిర్యాలగూడ నియోజ కవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని పక్కనబెట్టి వలసొచ్చిన నేతలకు, వారి అనుచరులకు పార్టీ పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించడం బ్రదర్స్ అసంతృప్తికి కారణమైందని వారి అనుచరులు చెబుతున్నారు.
తుంగతుర్తిలో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించడం కూడా పార్టీ అంతర్గత విభేదాలకు మరింత ఊపిరి పోసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నకిరేకల్‌లో మంత్రి వెంకటరెడ్డి కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయని, స్థానిక ఎన్నికల్లో వీరేశం, గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికే ప్రాధాన్యం పెరిగిందని బ్రదర్స్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై సీనియర్ నేతలు పలుమార్లు బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితి మారలేదని, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ పెరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంలో గాంధీభవన్ వేదికగా రాజగోపాల్ రెడ్డి నకిరేకల్, తుంగతుర్తి రాజకీయ పరిస్థితులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. ప్రస్తుతం వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలూనాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్ వంటి ఎమ్మెల్యేలు సీఎం కోటరీగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిలో రాజగోపాల్‌రెడ్డిపై మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలను ఏ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా ఖండించకపోవడం పార్టీలో మరింత చర్చకు దారితీసింది. ఇది యాదృచ్ఛిక మౌనమా? లేక బ్రదర్స్‌ను రాజకీయంగా ఒంటరిచేసే సంకేతమా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.