- ఢిల్లీ రాజకీయ పరిణామాల తర్వాత కేబినెట్ మార్పులపై ఊహాగానాలు
- ఉత్తమ్, వెంకట్రెడ్డిలకు జాతీయ బాధ్యతలు..?
- రాజగోపాల్, పద్మావతిలకు కేబినెట్ అవకాశాలపై చర్చ
- సర్(SIR) గడువు పెంపుతో ‘నామినెటేడ్’ ఆశావహుల్లో టెన్షన్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక చర్చల తర్వాత రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉండొచ్చనే ప్రచారం జోరందుకోవడంతో జిల్లా సీనియర్ మంత్రుల భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో “జిల్లా మంత్రులకు ఆగస్టు గండం” అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా జిల్లాలో పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికీ నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోటాలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన నేతలకు ప్రాధాన్యం దక్కుతుందా లేదా అన్న సందేహం వారిని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
కేబినెట్లో భారీ మార్పుల ప్రచారం
నామినేటెడ్ పదవుల చర్చలతో పాటు రాష్ట్ర కేబినెట్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశముందనే ప్రచారం రాజకీయంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నలమాద పద్మావతిల పేర్లు కొత్త కేబినెట్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికీ మంత్రి పదవులు లభించే అవకాశాలపై కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు నామినేటెడ పదవుల పైన ఆశలు పెంచుకున్న ఆశావహుల్లో టెన్షన్ పెరిగింది. సర్ గడువు ఆగస్టు 10 వరకు పొడగించడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. సర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్ వైపు చూడొద్దని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు మరో వారం రోజులు పొడగించిన నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
వెంకట్‌రెడ్డి స్థానంలో రాజగోపాల్‌రెడ్డి?
ప్రస్తుతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పార్టీ బాధ్యతల కోసం తప్పించి, ఆయన తమ్ముడు రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో రాజగోపాల్రెడ్డికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ మార్పు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నల్లగొండ జిల్లా రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజగోపాల్ మంత్రి పదవి హామీ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి ఒప్పందం ఏదీ తనతో జరగలేదని మంత్రి వెంకటరెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ రాజగోపాల్ తోపాటు, తనకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాల్సిందేనని పద్మావతి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కానందున అధిష్టానం పరిష్కార మర్గాన్ని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
ఉత్తమ్‌కు పార్టీ బాధ్యతలు.. పద్మావతికి మంత్రి పదవి?
బలమైన నాయకులను ప్రభుత్వ పదవుల్లో కాకుండా సంస్థాగత బాధ్యతల్లో వినియోగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించి, రాష్ట్ర కేబినెట్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించే దిశగా వ్యూహం రూపొందుతోందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ను జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలకు పంపి, ఆయన స్థానంలో పద్మావతిని కేబినెట్లోకి తీసుకురావచ్చనే ప్రచారం బలపడుతోంది. దీంతో మహిళా కోటాలో నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
జిల్లా రాజకీయాలపై ప్రభావం
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పటినుంచో వర్గాల ఆధారంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం చర్చలో ఉన్న మార్పులు అమలైతే జిల్లాలో నాయకత్వ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజ గోపాల్రెడ్డి మంత్రి అయితే జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింత పెరగవచ్చు. అదే సమయంలో పద్మావతికి మంత్రి పదవి లభిస్తే మహిళా నాయకత్వానికి కొత్త ఊతం లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గానీ, అధిష్టానం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఢిల్లీ పరిణామాల తర్వాత వెలువడుతున్న సంకేతాలు నల్లగొండ రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చాయి. కేబినెట్ మార్పులపై స్పష్టత వచ్చే వరకు జిల్లాలో రాజకీయ చర్చలు మరింత వేడక్కుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.