- డాక్టర్లు కమిట్మెంట్తో పనిచేయాలి
- చౌటుప్పల్లో ట్రామా కేర్ సెంటర్,
- చండూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుపై వైద్యాధికారులతో సమీక్ష.
మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHC) మరియు ఏరియా ఆసుపత్రులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి కావలసిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, అత్యాధునిక సాంకేతిక పరికరాలు మరియు అవసరమయ్యే నిధుల అంచనాలతో నివేదికలు అందించాలని యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల వైద్యాధికారులను కోరారు.
మునుగోడులోని తన క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సమస్యలు, చేపడుతున్న అభివృద్ధి పనులపై రెండు జిల్లాల వైద్యాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసుపత్రుల అప్గ్రేడేషన్ మరియు ప్రాధాన్యతలు:
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఆసుపత్రుల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు:
మునుగోడు, నాంపల్లి PHCలు: వీటిని ఆధునీకరించడంతో పాటు 30 పడకల ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయడం.
మర్రిగూడ CHC: ప్రస్తుతం ఉన్న 30 పడకల సామర్థ్యాన్ని 50 పడకలకు పెంపు, అదనపు సిబ్బంది నియామకం, పోస్టుమార్టం ఎగ్జామిన్ రూమ్ మరియు సాంకేతిక పరికరాల కల్పన.
చండూరు: రెవెన్యూ కేంద్రంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి మంజూరు మరియు నిర్మాణ ప్రతిపాదనలు.
గట్టుప్పల్ PHC: అవసరమైన సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాల ఏర్పాటుకు అంచనాల రూపకల్పన.
చౌటుప్పల్లో ట్రామా కేర్ సెంటర్ ఆవశ్యకత
జాతీయ రహదారి 65 (NH 65) పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, తీవ్రంగా గాయపడిన బాధితులను ‘గోల్డెన్ హవర్’లో హైదరాబాద్ తరలించలేక మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణ అత్యవసర చికిత్స అందించేందుకు చౌటుప్పల్లో ‘ట్రామా కేర్ సెంటర్’ (Trauma Care Centre) ని అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాటు చౌటుప్పల్లో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.
వైద్యులకు క్లాస్ – పేద ప్రజలకు అండగా నిలవాలి:
“ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక బిల్లులు కట్టలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వ ప్రజా వైద్యంపై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాజంలో అన్ని వృత్తుల కంటే డాక్టర్ వృత్తి ఎంతో గొప్పది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో పనిచేసే ప్రతి డాక్టర్ పూర్తి కమిట్మెంట్తో పనిచేయాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు.” — కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
బడ్జెట్ పెంపుపై ఆరోగ్య మంత్రితో చర్చిస్తా
ప్రస్తుతం గ్రామాల్లో నిర్మించే ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల (Sub-Centres) బడ్జెట్, పెరుగుతున్న ధరలు మరియు అధునాతన సాంకేతికతకు అనుగుణంగా సరిపోవడం లేదని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సబ్ సెంటర్లతో పాటు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల బడ్జెట్ను పెంచే విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా డీఎంహెచ్వో రాహుల్, డీసీహెచ్ మాతృ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్వో మనోహర్, డీసీహెచ్ సూర్య శ్రీ, మర్రిగూడ మరియు చౌటుప్పల్ సీహెచ్సీ వైద్యాధికారులు, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ పీహెచ్సీల డాక్టర్లు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.