- రెస్పిరేటరీ సిస్టమ్ నిలకడగా ఉన్నప్పటికీ మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో దెబ్బతిన్నట్లు వెల్లడించిన వైద్యులు..
- 72 గంటల న్యూరోలాజికల్ అసెస్మెంట్ తర్వాతే స్పష్టత.
- యశోద ఆసుపత్రి హెల్త్ బులెటిన్..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తీవ్ర గుండెపోటుతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఐసీయూ (ICU)లో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.
మెదడు పనితీరుపై వైద్యుల ఆందోళన
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ది సుదర్శన్ రెడ్డి రెస్పిరేటరీ సిస్టమ్ (శ్వాసకోశ వ్యవస్థ) సాధారణంగానే పనిచేస్తున్నప్పటికీ, గుండెపోటు సమయంలో మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో (Anoxic Brain Injury) మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి మాటలకు కానీ, శరీరానికి కలిగే నొప్పులకు కానీ స్పందించడం లేదని (Unresponsive) వైద్యులు స్పష్టం చేశారు.
హెల్త్ బులెటిన్లోని ముఖ్య విశేషాలు:
శ్వాసకోశం: రెస్పిరేటరీ సిస్టమ్ ఫంక్షనింగ్ నిలకడగానే ఉంది.
మెదడుపై ప్రభావం: ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతిన్నాయి.
స్పందన రాకపోవడం: ప్రస్తుతం ఆయన మాటలకు, స్పర్శకు లేదా నొప్పికి స్పందించడం లేదు.
క్రిటికల్ టైమ్ (72 గంటలు): అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల (International Medical Protocols) ప్రకారం 72 గంటల పాటు నిరంతరం న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్ (Neurological Re-assessment) నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఆయన కోలుకునే అవకాశాలపై పూర్తి స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.

అత్యున్నత వైద్యం అందిస్తున్నాం: యశోద వైద్య బృందం
ఆదివారం హనుమకొండలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రీన్ ఛానెల్ ద్వారా ఆయనను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర ముఖ్య నేతలు ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.