Breaking News: ఉత్తమ్‌.. ఎక్కడ చర్చకు పిలిచినా వస్తా.. కాలేశ్వరంపై అదే సిస్టమ్‌తోనే నిజం చెబుతా..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా మంత్రులు అత్యవసర సమావేశం పేరుతో హడావుడిగా సమీక్ష నిర్వహించారని, కరవు పరిస్థితులపై ప్రభుత్వం గంభీరంగా చర్చ చేస్తుందేమోనని భావించి తాను సమావేశానికి వెళ్లానన్నారు. అయితే అక్కడ ప్రజలకు భరోసా కలిగించే కార్యాచరణ కనిపించలేదని, కరవు పరిస్థితులపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అధికారుల సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చారని ఆరోపిస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్హౌస్, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, తాగునీటి సంక్షోభం, కరవు పరిస్థితులు, సాగునీటి నిర్వహణ తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చేందుకే మీటింగ్ పెట్టినట్టు ఉందని ఎద్దేవ చేశారు. అదే విషయం తనకు ముందుగానే చెబితే నేను కూడా అదే వేధిక పైన వాస్తవాలు వివరించే అవకాశం ఉండేది కదా అని ప్రశ్నించారు. తాను పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన సమయంలో నల్లగొండ జిల్లాలో కనీసం 200 అధికారుల సమావేశాలు నిర్వహించానని, ఒక్కరోజు కూడా అధికారుల సమావేశంలో రాజకీయాలు మాట్లాడలేదని  జగదీష్రెడ్డి అన్నారు. ఎల్నినో వంటి కీలక అంశంపై ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజంగా చర్చించే ధైర్యం ఉంటే హుజూర్నగర్, సూర్యాపేట, నల్లగొండ కలెక్టరేట్, హైదరాబాద్, కన్నెపల్లి పంప్హౌస్.. ఎక్కడికి పిలిచినా తాను వస్తానని ప్రకటించారు. మంత్రి ఉపయోగించిన అదే పవర్పాయింట్ ప్రజెంటేషన్, అదే ల్యాప్టాప్తోనే కాలేశ్వరం గొప్పతనం వివరిస్తానని, తాను ప్రత్యేకంగా ఎలాంటి ప్రజెంటేషన్ సిద్ధం చేసుకుని రానని స్పష్టం చేశారు. “నువ్వు చెప్పిన ప్రతి అక్షరం పచ్చి అబద్ధమని నిరూపిస్తా” అని సవాల్ విసిరారు. తాను మీడియా ప్రచారం కోసం మాట్లాడే వ్యక్తిని కాదని, వ్యక్తిగత సవాళ్లు విసిరే రాజకీయాలు చేయనని అన్నారు. “దూకి చస్తావా.. ఇలాంటి భాష మాది కాదు. నువ్వు చెబుతున్న అబద్ధాలను ప్రజల ముందే ఆధారాలతో నిరూపిస్తాం” అని పేర్కొన్నారు. ఉత్తమ్ ఉపయోగించిన అదే ల్యాప్టాప్తో నల్లగొండ క్లాక్టవర్ సెంటర్ లో అయినా చర్చుకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కలిసి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసమే తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. సుమారు 55 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లినా సీఎం, ఇరిగేషన్ మంత్రి చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. దీని వల్ల భవిష్యత్తులో నల్లగొండతో పాటు హైదరాబాద్కు కూడా తాగునీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందన్నారు.

కన్నెపల్లి పంప్హౌస్ రిపేర్లలో ఉందని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు ట్రయల్రన్ పేరుతో పంప్హౌస్ను ప్రారంభించిందని గుర్తు చేశారు. రైతులకు నీళ్లు ఇస్తే భారీ విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే పంప్హౌస్ను నడపడం లేదని ఆరోపించారు. “కరెంట్ బిల్లు కడితే కమీషన్లు రావు కాబట్టే దొంగనాటకం ఆడుతున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ను ఇప్పుడే ప్రారంభిస్తే సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు కూడా నీరు అందుతుందని, ఎస్సారెస్పీ(SRSP) కూడా నిండుతుందని తెలిపారు.

సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వమే గతంలో శాసనమండలిలో సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. కోదండరాం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం రికార్డుల్లో ఉందన్నారు. ఇప్పుడు సీఎం ఆదేశాలతో అదే విషయాన్ని మార్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. “నిజంగా నీకు అంతరాత్మ ఉంటే ఆ పదవిలో కొనసాగవు” అంటూ ఉత్తమ్పై వ్యక్తిగత విమర్శలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మరో పది నుంచి పదిహేను రోజుల్లో కరవు తీవ్రత ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికే రైతులు ఒక పంట నష్టపోతామనే ఆందోళనలో ఉన్నారని, అలాంటి సమయంలో ప్రభుత్వం ఇంకా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వానికి అనుభవరాహిత్యంతో పాటు బాధ్యతారాహిత్యం కూడా ఉందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఇంకుడు గుంతలు తవ్వుతామని చెప్పడం ప్రభుత్వ అవగాహనలేమికి నిదర్శనమని అన్నారు. కళ్ల ముందే పోతున్న నీటిని నిల్వ చేసుకునే తెలివి లేదని, చెప్పినా నేర్చుకునే విజ్ఞత కూడా లేదని విమర్శించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు లక్ష ఎకరాల్లో కూడా వరి నాట్లు పూర్తి కాలేదని, ఇప్పుడు రైతులకు పెసలు, కందులు, ఇతర ఆరుతడి పంటలు వేయాలని చెప్పడం వ్యవసాయ వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఇచ్చిన సలహా అని విమర్శించారు. “ఈ దశలో ఎవడైనా పెసర్లు, కందులు వేస్తాడా?” అంటూ ప్రశ్నించారు. మంత్రులకు వ్యవసాయంపై అవగాహన లేదని, వ్యవసాయ శాఖ అధికారులు కూడా “గుడ్డెద్దు చేలో పడినట్టు” వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సూపర్ ఎల్నినో వస్తుందని ఏడాది కాలంగా వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు, మీడియా హెచ్చరిస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వానాకాలం ప్రారంభానికి ముందే సమీక్షలు నిర్వహించి ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాల్సిందిపోయి ఇప్పుడు వానాకాలం మధ్యలో సమావేశాలు పెట్టి ఇంకుడు గుంతలు తవ్వుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. “ఆ బొందలు ఇప్పుడు ఎందుకు? ప్రజలు వాటిలో పడటానికా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Share
Share