APB News Exclusive: స్టేషన్‌ వదలం.. లూప్‌లైన్‌ వెళ్లం!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: లూప్లైన్ పోస్టింగ్లలో పనిచేయడానికి ఇష్టపడని పలువురు ఎస్ఐలు రాజకీయ నేతల ద్వారా పైరవీలు చేయించుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ధోరణి వెనక ఉన్న అసలు కారణాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయగా, కొందరు అధికారులు స్టేషన్ల్లో దీర్ఘకాలంగా కొనసాగుతూ ఏర్పరుచుకున్న అక్రమ దందాలు, స్థానిక నెట్వర్క్లు, ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన కారణాలుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు ఎస్ఐ(SI)లు స్టేషన్లలో పట్టు పెంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా, భూముల వివాదాలు, సెటిల్మెంట్లు, అక్రమ వసూళ్లు, ఇతర వ్యాపార వ్యవహారాల్లో కొందరు పోలీసు అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు శాఖలోనే చర్చకు దారితీస్తున్నాయి.

నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదులు గౌడ్ సస్పెన్షన్ తర్వాత ఉమ్మడి జిల్లాలో లూప్లైన్ జాబితాలో ఉన్న అధికారుల పనితీరుపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నల్లగొండ జిల్లాలో ఐదుగురు, సూర్యాపేట జిల్లాలో ఐదుగురు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు ఎస్ఐలు లూప్లైన్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. టూటౌన్ ఎస్ఐ సైదులు లూప్లైన్లోకి వెళ్లకుండా ఉండేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన అధికారపార్టీ కీలక నేతల ద్వారా పైస్థాయిలో పైరవీ చేయించినట్లు శాఖలో ప్రచారం జరుగుతోంది. నల్లగొండలోనే మరికొంతకాలం కొనసాగేందుకు రాజకీయ ఆశ్రయం కోరినట్లు తెలిసింది. ఈ వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. లూప్ లైన్ పోస్టింగ్ను నిరాకరించి స్టేషన్లోనే కొనసాగేందుకు ప్రయత్నించడం, అందుకు రాజకీయ ఒత్తిళ్లను ఉపయోగించుకోవడం వంటి పరిణామాలను డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం టూటౌన్ ఎస్ఐ సైదులును సస్పెండ్ చేసినట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది.

సైదులు గౌడ్కు విధుల నిర్వహణలో మంచి పేరుందని కొందరు చెబుతున్నప్పటికీ, డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా కొంతకాలం లూప్లైన్లో విధులు నిర్వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పైరవీలకు ఆస్కారం కల్పించడం వల్లే చివరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని శాఖలో చర్చ సాగుతోంది. దీంతోపాటే మరికొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. రూల్స్ ప్రకారం ఎస్ఐలు కొంతకాలం పాటు లూప్లైన్లో పనిచేయాల్సి ఉంటుంది. స్పెషల్ బ్రాంచి, క్రైం బ్రాంచి, విజిలెన్స్, ఇంటిలిజెన్స్, విద్యుత్, ఆర్టీసీ, ఇలా వివిధ డిపార్ట్మెంట్లో కచ్చితంగా పనిచేయాలి. కానీ ఇక్కడ పనిచేయడం వల్ల నయాపైసా ఉపయోగం ఉండదని, పైగా ఖర్చు తప్పా ఆదాయం ఉండదనే అభిప్రాయం డిపార్ట్మెంట్లో పాతుకుపోయింది. అదే ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్లలో పనిచేయడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు నెరవేరుతాయనే బలమైన అభిప్రాయంతో ఉన్న ఎస్ఐలు లూప్లైన్ లోకి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా లూప్లైన్ వెళ్లే జాబితాలో సుమారు 180 మంది ఎస్ఐలు ఉన్నట్టు తెలిసింది. ఇంతమంది ఏళ్ల తరబడి స్టేషన్ల్లో పనిచేయడం వల్ల లూప్లైన్ లోనే నలిగిపోతున్న ఎస్ఐల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ డిపార్ట్మెంట్లో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టడం, దాంతో సైదులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వివాదస్పదమైంది. సైదులు ఎపిసోడ్ తో అప్రమత్తమైన పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా వర్గాలను రంగంలోకి దింపింది. లూప్లైన్ పోస్టింగ్కు వెళ్లేందుకు ఎందుకు ఇష్టపడటం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రాజకీయ, ఆర్థికంగా ప్రాధాన్యం ఉన్న పట్టణాల్లో పనిచేయడానికే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ కేడర్ కలిగిన ఆఫీసర్లు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి స్టేషన్లలో స్థానిక రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, వివిధ ప్రయోజన సమూహాల పైన పోలీసుల పట్టు పెరుగుతుంది. లూప్లైన్ పోస్టింగ్లను కెరీర్లో వెనుకడుగు అనే భావనతో చూడటమే కాకుండా, స్టేషన్లలో కొనసాగడం ద్వారా లభించే పట్టు, పరిచయాలు, ఇతర ప్రయోజనాలను కోల్పోవడానికి ఇష్టపడటం లేదనే అభిప్రాయం శాఖలో వ్యక్తమవుతోంది.

నల్లగొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, వైన్స్ మామూళ్లు, అక్రమ మైనింగ్, భూముల వివాదాల్లో పలువురు పోలీసులు నేరుగా తలదూరుస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కొన్ని కీలక స్టేషన్లకు, డివిజన్ స్థాయి అధికారులతో నేరుగా ఉన్న లాబీయింగ్ కూడా శాఖాపరంగా అందరినీ చిక్కుల్లో పడేస్తోంది. పలువురు పోలీస్ ఆఫీసర్లకు గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉందనే సంగతిని ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఎస్ఐ సైదులుకు సపోర్ట్ గా, అధికార పార్టీ నేత నేరుగా పై స్థాయి అధికారులకు ఫోన్ చేయడం అనేది ఆషామాషీ కాదని, దీని వెనక డిపార్ట్మెంట్లో పలువురు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సైదులు ఎపిసోడ్ తో జిల్లా పోలీస్ శాఖలో భారీ మార్పులు కూడా ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు పెండింగ్ లో పెట్టిన మిర్యాలగూడ డీఎస్పీ ఎట్టకేలకు విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన ప్లేస్ లో డీఎస్పీగా వస్తారని భావించిన ఆనంద్ రెడ్డి వస్తారా.? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Share
Share